కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా, కొంతమంది వాసన లేదా రుచి శక్తిని శాశ్వతంగా కోల్పోతున్నారు, ఎందుకు

  • Publish Date - July 11, 2020 / 09:02 AM IST

రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిని తిరిగి పొందలేకపోతున్నారు. వారు శాశ్వతంగా ఆ రెండింటిని కోల్పోతున్నారు. ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది.

అంతర్జాతీయ పరిశోధకుల బృందం, 202మంది ఇటాలియన్లపై పరిశోధనలు జరిపింది. వారంతా కరోనా బాధితులే. కానీ ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రుచి లేదా వాసన సెన్స్ గురించి అడిగారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అంటే 0 మార్కులు, తీవ్రమైన ప్రాబ్లమ్ ఉంది అంటే 5 మార్కులు ఇచ్చారు.

రుచి లేదా వాసన కోల్పోయే లక్షణాన్ని ముందు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి, ఆసుపత్రి పాలైన బాధితుల్లో గుర్తించారు. ఆ తర్వాత కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న బాధితుల్లోనూ ఈ లక్షణం బయటపడింది. olfactory neurons ను సపోర్ట్ చేసే కణాలను వైరస్ దెబ్బతియ్యడం వల్ల ఇలా జరుగుతోందని తొలుత శాస్త్రవేత్తలు భావించారు.

అంతర్జాతీయ పరిశోధకుల బృందం జరిపిన స్టడీలో, 200 మంది బాధితుల్లో సుమారు 113 మంది, కరోనా పాజిటివ్ అని తేలడానికి 2 వారాల ముందు నుంచే రుచి లేదా వాసన శక్తిని కోల్పోయారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత.. 55మందిలో 46మందిలో రుచి లేదా వాసన శక్తి లక్షణాలు మెరుగయ్యాయి. 12మందిలో మాత్రం పరిస్తితి మరింత అధ్వానంగా మారింది. రుచి లేదా వాసన శక్తిని వారు తిరిగి పొందలేకపోవడమో, మరింత దిగజారడమో జరిగింది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొందరు బాధితులు వాసన లేదా రుచి శక్తిని ఎందుకు శాశ్వతంగా కోల్పోతున్నారు? వారు తిరిగి ఆ సెన్స్ ని పొందే అవకాశం ఉందా లేదా? అసలు కరోనా వైరస్ వేటిపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి అంశాలపై పరిశోధకులు ఫోకస్ పెట్టారు. వీటిపై అధ్యయనాలు చేస్తున్నారు. కాగా, వాసన లేదా రుచి గుణాలను కోల్పోయిన వారు, థెరపీ ద్వారా తిరిగి వాటిని పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకునే వ్యక్తుల్లో, ముక్కులోని కణాలను మాత్రమే వైరస్ అఫెక్ట్ చేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందంటే, అలాంటి వారిలో వాసన శక్తికి ఉపయోగపడే నాడీ వ్యవస్థను వైరస్ దెబ్బతీసినట్టుగా గుర్తించారు. ఆ కారణంగానే నాడీ కణాలు రిపైర్ లేదా రీజనరేట్ కావడానికి చాలా సమయం పడుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు