ఒక్క అబద్దంతో మళ్లీ లాక్ డౌన్ : తల పట్టుకున్న అధికారులు

South Australia man lie caused six days lock down : కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఒకే ఒక్క అబద్దం చెప్పటం వల్ల మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రంలో. దీంతో ప్రజలంతా మరోసారి హడలిపోయారు.
ఓ వ్యక్తిచేసిన పొరపాటు..అబద్దం వల్ల ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు ప్రకటనలు చేశారు. షాపులు మూసివేసిన పరిస్థితి సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత కూడా ఇంతటి కఠిన పరిస్థితులు రాలేదు ఆస్ట్రేలియాలో. కానీ ఓ వ్యక్తి చెప్పిన అబద్ధం కారణంగా అలా చేయాల్సి వచ్చింది.
https://10tv.in/mumbais-massive-power-cut-last-month-may-have-been-the-work-of-hackers/
వివరాల్లోకి వెళితే..సౌత్ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అతన్ని ఎవరెవరు కలిశారో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. అలా అతన్ని కలిసివారందరినీ ఐసోలేషన్‌లో పెట్టాలని భావించారు.
అసలు అతనికి కరోనా ఎలా సోకిందా? అని ఆరా తీసే క్రమంలో అతను చెప్పిన వివరాల్లో ఓ పిజ్జా షాపు పేరు బయటకొచ్చింది. తాను పిజ్జా కొనుక్కోవడానికి ఓ షాపుకు వెళ్లానని.. పనిచేస్తున్న ఓ వ్యక్తికి అప్పటికే కరోనా సోకి ఉందని తెలిపాడు. దీంతో ఒక్కసారి షాపుకు వెళ్తేనే కరోనా సోకిందంటే.. ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు ఆందోళన చెందారు. ఇక ఆ షాపుకు ఎవరెవరు వెళ్లారో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.
ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని..హెచ్చరికలు జారీ చేసింది. అయితే చివరికి తేలిందేంటంటే.. అధికారులతో మాట్లాడిన వ్యక్తి అబద్ధం చెప్పాడు. అతను పిజ్జా కొనుక్కోవడానికి ఒక్కసారి వెళ్లానన్న షాపులోనే అతను కూడా పనిచేస్తున్నాడు. అంటే కరోనా సోకిన కొలీగ్‌తో చాలా రోజులుగా పని చేయడం వల్లే అతనికి కరోనా సోకిందని దర్యాప్తులో తేలింది.
ఈ విషయాన్నిఆ వ్యక్తి దాచి పెట్టి అబద్ధమాడాడు. దీన్ని నమ్మేన అధికారులు వైరస్ తీవ్రత ఎక్కువైపోయిందని వణికిపోయారు. అసలు విషయం తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అతన్ని ఏమనాలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలీక తల పట్టుకున్నారు. వారి కోపాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా తెలీక ఉక్కిరిబిక్కిరైపోయారు.
దీని గురించి సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్ స్టీవెన్ మార్షల్ మాట్లాడుతూ.. ‘నాకు అతనిపై ఉన్న కోపాన్ని.. కోపం అంటే సరిపోదు. అంత పిచ్చి కోపం వచ్చేస్తోంది. బలవంతంగా అణచుకోవాల్సి వచ్చింది. దాంతో నాకు తలబద్ధలైపోతున్న ఫీలింగ్ కలిగిందని తెలిపారు. సదరు వ్యక్తి తలాతోకా లేకుండా సమాధానాలు చెప్పటం వింటే అతని తల పగలగొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపారు. అతని సమాధానాలపై అనుమానం తీరక ట్రేసింగ్ టీమ్ దర్యాప్తు చేపట్టామని ఆ దర్యాప్తులోనే అసలు విషయం బయటపడిందని తెలిపారు.
ఇలా అబద్ధం చెప్పి సమాజంలో భయాందోళనలకు కారణమైన అతనికి ఎటువంటి శిక్ష వేస్తారని అధికారులను ప్రశ్నిస్తే.. వాళ్లు మాత్రం ఏం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఇలా కరోనా విషయంలో అబద్ధాలు ఆడే వారికి ఎటువంటి శిక్షా లేదని, కానీ ఈ అంశాన్ని పునఃపరిశీలించి కొత్త చట్టం చేసే అవసరం ఏర్పడిందని మాత్రం అధికారులు వెల్లడించారు.
ప్రతీ వ్యక్తికి ప్రస్తుత ఈ కోరోనా పరిస్థితుల్లో బాధ్యత ఉందని ప్రతీ ఒక్కరూ అలా బాధ్యతగా వ్యవహరిస్తే ఇటువంటి అనర్ధాలు జరగవని..అతను నిజం చెప్తే అసలు ఇంత గొడవ ఉండేదే కాదని వెల్లడించారు. ఈ అనర్థం వల్ల వచ్చిన లాక్‌డౌన్‌ను త్వరగా ముగిస్తామని, షాపులు తెరుచుకోవడానికి పర్మిషన్లు కూడా ఇస్తామని తెలిపారు. అతను చేసిన పనివల్ల అనవసరంగా ఆరురోజుల పాటు లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.