Spacex launches 46 satellites
Spacex launches 46 satellites: ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘స్టార్‌లింక్’ ద్వారా శాస్త్రవేత్తలు మరో భారీ ప్రయోగం చేశారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నిన్న 46 స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ‘ఫాల్కన్-9’ రాకెట్ ద్వారా 46 స్టార్ లింక్ శాటిలైట్లను భూ నిమ్న కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. స్పేస్ఎక్స్ ఈ ఏడాది చేపట్టిన 33వ మిషన్ ఇది. కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను నింగికి పంపారు.
రెండు దశలుగా ఈ రాకెట్ ప్రయోగం సాగింది. రాకెట్ ను ప్రయోగించిన 9 నిమిషాల తర్వాత మొదటి దశలో పసిఫిక్ మహాసముద్రంలోని స్పేస్-ఎక్స్ డ్రోన్ షిప్ మీదకు రాకెట్ చేరుకుంది. ఇక, రెండవ దశలో ఉపగ్రహాలతో కక్ష్యలోకి దూసుకెళ్ళింది. మొత్తం 63 నిమిషాల్లో ఈ ప్రయోగం ముగిసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా ఆ సర్వీసులను అందించేందుకు స్టార్ లింక్ కృషి చేస్తోంది. స్టార్ లింక్ ద్వారా రానున్న నెలల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది.
నిన్న చేసిన ప్రయోగంపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. తమ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. స్పేస్ఎక్స్ చేపడుతున్న ప్రయోగాలపై రష్యా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు స్టార్‌లింక్ శాటిలైట్లను ధ్వంసం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చైనా ప్రభుత్వానికి ఆ దేశ శాస్త్రవేత్తలు కొన్ని రోజుల క్రితమే సూచించారు. ఆ శాటిలైట్ల వల్ల చైనా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తే వాటిని ధ్వంసం చేయాలని అన్నారు. స్టార్ లింక్ ద్వారా గత ఏడాది మొత్తం కలిపి 31 రాకెట్ల ప్రయోగం చేశారు స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు.
46 ‘స్టార్‌లింక్’ ఉపగ్రహాలను ‘ఫాల్కన్-9’ రాకెట్ ద్వారా పంపిన ‘స్పేస్ఎక్స్’
Watch Falcon 9 launch 46 Starlink satellites to orbit → https://t.co/0K9OPrvKjJ https://t.co/kKNJhXk17x
— SpaceX (@SpaceX) August 12, 2022