బిగ్ బ్రేకింగ్ : నాసా వ్యోమగాయులతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న SpaceX అంతరిక్ష నౌక

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 02:51 PM IST
బిగ్  బ్రేకింగ్ : నాసా వ్యోమగాయులతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న SpaceX అంతరిక్ష నౌక

Updated On : May 31, 2020 / 2:51 PM IST

శనివారం  ఇద్దరు నాసా వ్యోమగాములతో బయలుదేరిన స్పేస్ x కంపెనీకి చెందిన అంతరిక్ష నౌక  విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంది. స్పేస్ x సంస్థ.. ఈ మిషన్‌కు “క్రూ డ్రాగన్-2″గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్ స్టేషన్ కు క్రూ డ్రాగన్ చేరుకున్నట్లు స్పేస్ x ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ మిషన్‌ ను శనివారం అమెరికాలో ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు.

ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి. ఎలన్ మస్క్ సారథ్యంలోని SpaceX అనే ప్రేవేట్ అమెరికన్ ఏరోస్పేస్ మానుఫ్యాక్చరర్ మరియు స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసెస్ కంపెనీ ఈ ఘనత సాధించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇద్దరు నాసా వ్యోమగాములని అంతరిక్షంలోకి పంపింది SpaceX. దీంతో అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది.

క్రూ డ్రాగన్ అంతరిక్షనౌకలో వెళ్లిన వ్యోమగాముల పేర్లు బాబ్ బెంకెన్, డగ్ హార్లీ. వీరిని 2000 సంవత్సరంలో ఈ మిషన్ కోసం ఎంపిక చేశారు. ఇద్దరూ స్పేస్ షటిల్ ద్వారా రెండేసి సార్లు అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. వీరు నాసా ఆస్ట్రనట్ కోర్స్ తీసుకున్న అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములు. ఇద్దరూ ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ- స్పేస్ఎక్స్ ‘ద క్రూ డ్రాగన్’ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్) దగ్గరకు వెళ్లారు. అమెరికా సహా, ప్రపంచాన్ని కరోనా కల్లోలం కుదిపేస్తున్న సమయంలో శనివారం ఈ ప్రయోగం నిర్వహించారు. 

2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్‌ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్‌ఎస్‌ సహా ఇతర రోదసీయానాలకు అవసరమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన డ్రాగన్‌ ఐఎస్‌ఎస్‌కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.