ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కరోనా వైరస్.. 700మంది చనిపోవచ్చు: అధ్యయనం

  • Publish Date - November 1, 2020 / 11:43 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు టైమ్ మిగిలి ఉంది. ఈ సమయంలో హీటెక్కిన రాజకీయ వాతావరణంలో అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై ప్రజల్లోకి పోయి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారి బారినపడ్డ ప్రజలను రక్షిస్తున్న డాక్టర్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవగా.. కరోనా మరణాల ద్వారా డాక్టర్లు లాభపడుతున్నారని ట్రంప్ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి.



ఈ క్రమంలోనే ఎన్నికల నిమిత్తం డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గన్న ర్యాలీల వల్ల 30 వేల మందికి పైగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నట్లుగా ఓ అధ్యయనం వచ్చింది. ఈ విషయాన్ని స్టాన్‌ఫోర్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. జూన్‌ 20వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గన్న 18 ఎన్నికల ప్రచార ర్యాలీలకు గానూ 30 వేల మంది కోవిడ్‌-19 బాధితులయ్యే అవకాశం ఉందని అందులో 700 మంది చనిపోవచ్చు అని Stanford University అధ్యయనం తెలిపింది.



“The Effects of Large Group Meetings on the Spread of COVID-19: The Case of Trump Rallies”  పేరుతో అధ్యయనం విడుదల చేయగా.. ఈ ర్యాలీల వల్ల 30 వేలకు పైగా కేసులు 700 మందికి పైగా మరణాలు సంభవించవచ్చునని అంచనా వేసింది. ఇందులో ఆ ర్యాలీలకు హాజరు కాని వారు కూడా ఉండవచ్చు అని అధ్యయనం చెబుతుంది. గ్రూపులుగా ఏర్పడి మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా ర్యాలీలు జరిపితే కరోనా వ్యాప్తి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పరిశోధకులు అధ్యయనంలో స్పష్టంచేశారు. ఈ అధ్యయనంపై ట్విట్టర్‌ పోస్ట్‌పై డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ స్పందించారు. ట్రంప్ ప్రజల గురించి, ఆఖరికి ఆయన సపోర్టర్స్ గురించి కూడా పట్టించుకోరని ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు.



ర్యాలీలు నిర్వహించని దేశంలోని ఇతర ప్రాంతాలలో పోలిస్తే వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉందని అధ్యయనం చెబుతుంది. ఈ అధ్యయనం రాసినవారిలో Stanford University ఎకనామిక్స్ విభాగం చైర్మన్ బి. డగ్లస్ బెర్న్హీమ్ ఉన్నారు. సామాజిక దూరం గురించి సిడిసి మార్గదర్శకాలను పాటించకపోవడం మరియు ముసుగులు ధరించడం కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని పెంచుతుందని ఆయన అందులో వెల్లడించారు.