Tigers Dead: బాబోయ్.. 72 పులులు మృతి.. ప్రముఖ పర్యాటక టైగర్ పార్క్ క్లోజ్.. షాకింగ్ విషయాలు చెప్పిన అధికారులు
ఈ వ్యాధి వ్యాప్తికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. కానీ పులులకు ఆహారంగా వాడే పచ్చి కోడి మాంసంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్క్ అధికారులు.
Tiger Representative Image (Image Credit To Original Source)
- పులుల పార్కులో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి
- రోజుల వ్యవధిలోనే 72 పులులు మృత్యువాత
- కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా చనిపోతున్నట్లు వెల్లడి
Tigers Dead: థాయిలాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక టైగర్ కింగ్డమ్ చియాంగ్ మై పార్క్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ పార్కులో పులులు మృత్యువాత పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు ఏకంగా 72 పులులు చనిపోయాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాత్కాలికంగా పార్క్ ను మూసివేశారు. చియాంగ్ మై పార్క్ ఉత్తర థాయిలాండ్‌లోని ప్రముఖ ప్రైవేట్ పార్క్. ఫిబ్రవరి 8 నుండి ఇప్పటివరకు ఇక్కడ 72 పులులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది.
పులుల మరణాలకు ప్రాణాంతక వైరస్ కారణం అని అధికారులు చెబుతున్నారు. కనైన్ డిస్టెంపర్ వైరస్ (CDV) కారణంగా పులులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించారు. ఇది అంటువ్యాధి అని పేర్కొన్నారు. తాత్కాలికంగా పార్కును మూసివేసిన అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు.
చియాంగ్ మై వన్యప్రాణుల సంరక్షణ కార్యాలయ డైరెక్టర్ దీనిపై స్పందించారు. మిగతా పులులను సమీప జిల్లాకు తరలించామని, క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. బతికున్న పులులకు టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పులులు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు.. చనిపోయిన వాటి కళేబరాల నమూనాలను ల్యాబ్ కి పంపి టెస్టులు చేస్తున్నారు.
ఆహారంగా ఇచ్చే పచ్చి కోడి మాంసంపై అనుమానాలు..
ఈ వ్యాధి వ్యాప్తికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. కానీ పులులకు ఆహారంగా వాడే పచ్చి కోడి మాంసంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్క్ అధికారులు. చియాంగ్ మై లోని పశువుల కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం.. పులులకు కనైన్ డిస్టెంపర్ వైరస్ సోకిందని తేలింది. ఇది కుక్కలు, పిల్లి జాతుల్లో కనిపించే వైరస్ అని తెలిపారు. ఈ వైరస్ తో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడటంతో భారీ సంఖ్యలో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయనే అభిప్రాయానికి వచ్చారు.
“అనారోగ్యానికి గురైన పులులకు చికిత్స చేయడం.. కుక్కలు, పిల్లులకు చికిత్స చేయడం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కుక్కలు, పిల్లులు మనతో దగ్గరగా జీవిస్తాయి. కాబట్టి వాటిలో అనారోగ్య లక్షణాలు కనిపించగానే మనం వెంటనే స్పందించి చికిత్స అందించగలము. అయితే, పెద్ద పులులు అలా కాదు. అవి అనారోగ్యానికి గురైనప్పుడు లక్షణాలను, కారణాలను గుర్తించడం చాలా కష్టం. అవి అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించే సమయానికే చాలా ఆలస్యమైపోతుంది. ఏదో తప్పు జరిగిందని మనం గమనించే సమయానికి వాటిలో అనారోగ్యం ముదిరిపోయి ఉండొచ్చు” అని జంతు సంరక్షణ అధికారులు వివరించారు. కాగా చియాంగ్ మై లోని రెండు జిల్లాలు మే రిమ్, మే టేంగ్ పర్వత ప్రాంతాలలో ప్రాణాంతక వైరస్ కనిపించినట్లు పేర్కొన్నారు.
థాయిలాండ్‌లోని టైగర్ కింగ్డమ్ పార్క్ ఒక ప్రైవేట్ పార్క్. ఇది చాలా ఫేమస్. పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి పులులతో అతి దగ్గరగా ఫొటోలు దిగే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. అంతేకాదు పులులను తాకొచ్చు, కౌగిలించుకోవచ్చు కూడా. ఖుమ్ స్యూ ట్రాకర్న్ కో లిమిటెడ్ ఈ పార్క్ నిర్వహణ చూస్తోంది. ఈ ప్రైవేట్ కంపెనీ టైగర్ కింగ్డమ్ ఫుకెట్ తో పాటు మూడు టైగర్ పార్కులను నిర్వహిస్తోంది. రెండు ఫుకెట్‌లో ఉన్నాయి, ఒకటి పట్టాయాలో ఉంది.
Also Read: నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. ఆపదలో బాలిక సాహసం.. లిఫ్ట్ ప్రమాదం నుంచి పిల్లలను ఎలా కాపాడిందో చూడండి
