Indus Waters Treaty
Indus Waters Treaty: జమ్మూకశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావించిన ప్రభుత్వం.. ఆ దేశానికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీంతో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే.. ఆ దేశంలో 80శాతం వ్యవసాయం సింధూ పరివాహక నీటి వనరులపైనే ఆధారపడి ఉంటుంది.
సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించగానే అమెరికా గగ్గోలు పెడుతోంది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారతదేశానికి లేదంటూ పేర్కొంటుంది. పాకిస్థాన్ కు చెందిన కొందరు నేతలు సింధూ నది పాకిస్థాన్ దేశానిది.. అందులో నీళ్లు పారకపోతే రక్తం ప్రవహిస్తుందంటూ భారత్ కు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ చెబుతున్నట్లు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా సస్పెండ్ చేసేందుకు వీలు లేదా..? ఆర్టికల్ 62 ఏం చెబుతోందనే వివరాలను పరిశీలిస్తే..
సింధూ జలాల ఒప్పందంలో సస్పెన్షన్ కు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఏమీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం.. ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం అని పేర్కొంది. అలాంటప్పుడు భారత్ నిర్ణయం చెల్లుబాటు అవుతుందా అంటే.. అవుతుందనే వాదన కూడా ఉంది.
1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని తెలుస్తోంది. పరిస్థితుల్లో మౌలిక మార్పులు చోటు చేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్ లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పీకే సక్సేనా చెప్పినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని, చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపుతట్టినా లాభం ఉండదని చెప్పారు.
సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. అంతేకాదు.. వేసవి దృష్ట్యా సింధూ బేసిన్ లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాకిస్తాన్ అల్లాడిపోవటం ఖాయమని చెప్పొచ్చు.