Nobel Prize In Physics : భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు

Nobel (1)

2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు సుకురో మనాబో(90), క్లాస్‌ హాసిల్‌మన్‌(89), జార్జియో పారిసీ(73)ని ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ మంగళవారం ప్రకటించింది.

భూతాపంపై పరిశోధనలకు గాను స్యుకురో మనాబో, క్లాస్​ హాసిల్​మన్​కు మరియు సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనలకు గానూ పారిసీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. కాగా,జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని స్యుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌ పంచుకోనున్నారు. నోబెల్ బ‌హుమ‌తితోపాటు ఇచ్చే ప్రైజ్‌మ‌నీలో కూడా స‌గం పారిసీకి, మిగ‌తా స‌గం మాన‌బో, హాసిల్‌మన్‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు అకాడ‌మీ తెలిపింది. నోబెల్‌ అవార్డ్‌ కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు నగదు పురస్కారం అందజేస్తారు. ఆ మొత్తాన్ని ఈ ముగ్గురికి పంచుతారు.

స్యుకురో మ‌నాబె
1931లో జ‌పాన్‌లోని షింగు సిటీలో జ‌న్మించారు. టోక్యో యూనివర్శిటీ నుంచి 1957లో ఆయన పీహెచ్‌డీ పొందారు. అమెరికాలోని ప్రిన్స్‌స్ట‌న్ యూనివ‌ర్సిటీలో సీనియ‌ర్ మెటిరాలాజిస్ట్‌గా చేస్తున్నారు. వాతావ‌ర‌ణంలో కార్బ‌న్‌డైఆక్సైడ్ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉప‌రిత‌ల ఉష్ణోగ్ర‌త‌లు ఎలా పెరుగుతున్నాయో నిరూపించినందుకు గాను స్యుకురో మ‌నాబోను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేశారు. ప్ర‌స్తుత ప‌ర్యావ‌ర‌ణ మోడ‌ల్స్‌ను రూపొందించ‌డానికి ఆయ‌న ర‌చ‌న‌లు ఓ ఫౌండేష‌న్‌లా ప‌ని చేసిన‌ట్లు స్వీడిష్ రాయ‌ల్ అకాడ‌మీ తెలిపింది.

క్లాస్ హాసిల్‌మన్
1931లో జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్‌లో జన్మించారు. జ‌ర్మ‌నీలోని గొట్టిన్‌జెన్ యూనివ‌ర్సిటీ నుంచి 1957లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. హాంబ‌ర్గ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెటిరాల‌జీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కలిపే మోడ‌ల్‌ను సృష్టించినందుకుగాను క్లాజ్ హాసిల్‌మన్‌ను కూడా నోబెల్ దక్కింది. మ‌నుషుల కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌వుతున్న కార్బ‌న్‌ డై ఆక్సైడ్ వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప్రయోగాలు నిరూపిస్తున్నాయి.

గియోర్గియో పారిసీ
1948లో ఇట‌లీలోని రోమ్‌లో జ‌న్మించారు. రోమ్‌లోని సెపింజా యూనివ‌ర్సిటీ నుంచి 1970లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెపింజా వ‌ర్సిటీలోనే ప్రొఫెస‌ర్‌గా చేశారు. క్ర‌మ‌ర‌హిత సంక్లిష్ట ప‌దార్థాల‌లో దాగి ఉన్న న‌మూనాల‌ను పారిసీ క‌నుగొన్నారు. సంక్లిష్ట వ్య‌వ‌స్థ‌ల సిద్ధాంత ర‌చ‌న‌ల‌కు అత‌ని ఆవిష్క‌ర‌ణ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ తెలిపింది

కాగా, వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో నోబెల్‌ పురస్కారాలను అందిస్తారన్న విషయం తెలిసిందే. సొమవారం వైద్య శాస్త్రంలో నోబెల్​ బహుమతిని ప్రకటించగా.. అమెరికా సైంటిస్టులు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లు ఈ బహుమతి దక్కింది.

READ మెడిసిన్ విభాగంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్