Nobel Prize In Medicine : మెడిసిన్ విభాగంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్

  2021 ఏడాదికి గాను ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్​ బహుమతిని ప్రకటించారు.

Nobel Prize In Medicine : మెడిసిన్ విభాగంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్

Nobel

Nobel Prize In Medicine  2021 ఏడాదికి గాను ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో  నోబెల్​ బహుమతిని ప్రకటించారు. నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మన్ సోమవారం విజేతలను ప్రకటించారు. మెడిసిన్ విభాగంలో డేవిడ్‌ జూలియస్‌, ఆర్డేమ్‌ పటాపౌటియన్‌ను అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి వరించింది. ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు దాదాపు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. కాగా, నోబెల్‌ బహుమతుల ప్రకటన వీరి అవార్డుతోనే ప్రారంభమైంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే బహుమతులు ప్రకటించనున్నారు.

కాగా, మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న “డేవిడ్‌ జూలియస్‌, ఆర్డేమ్‌ పటాపౌటియన్‌” ఇద్దరూ అమెరికా జాతీయులే కావడం గమనార్హం. వేడి, చలి, స్పర్శకు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను వీరికి సంయుక్తంగా అవార్డు లభించింది. ఉష్ణ గ్రాహకాలపై పరిశోధన కోసం మిరపకాయల్లోని కాప్సాయ్​సిన్​ అనే ఘాటైన పదార్థాన్ని డేవిడ్ ఉపయోగించారు. వేడికి ప్రతిస్పందించేలా చర్మంలో ఉండే సెన్సార్​ను గుర్తించారు. ఇదే తరహాలో… చర్మం, శరీరంలోని అవయవాలు స్పర్శకు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆర్డెమ్ పరిశోధన చేశారు.

ప్రపంచంలోని మరో రహస్యాన్ని వీరి పరిశోధన బయటపెట్టింది. ఇది మన మనుగడకే చాలా కీలకం. కనుక ఇది చాలా గొప్ప పరిశోధన. దీర్ఘకాలిక నొప్పులు సహా మరెన్నో వ్యాధులకు చికిత్సా విధానాల అభివృద్ధికి వీరి పరిశోధనలు ఉపకరిస్తాయని నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మన్ తెలిపారు.

ALSO READ Supreme Court : వ్యవసాయ చట్టాలు అమల్లో లేనప్పుడు నిరసనలెందుకు?