Afghanistan : అప్ఘాన్ మాజీ అధ్యక్షుడిని కలిసిన తాలిబన్ ఫ్యాక్షన్ లీడర్
అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ సంస్థ..అతిత్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో

Taliban Leader
Afghanistan అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ సంస్థ..అతిత్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాలిబన్ సంస్థలో కీలకమైన మరియు అమెరికా నిషేధిత హక్కానీ నెట్‌వర్క్(టెర్రరిస్ట్ గ్రూప్) లీడర్ అనస్ హక్కానీ బుధవారం(ఆగస్టు-18,2021) అప్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ తో భేటీ అయ్యారు. సీనియర్ తాలిబన్ ఫ్యాక్షన్ లీడర్ గా పేరుపొందిన అనస్ హక్కానీ..మాజీ అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నారని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియలేదు. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు విషయాలు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారని సమాచారం.
తాలిబన్‌లో హక్కానీ నెట్‌వర్క్ అనేది చాలా కీలకం. పాకిస్థాన్ సరిహద్దు నుంచి ఈ గ్రూప్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. కొన్నేళ్లుగా మరియు ఇటీవల కాలంలో రాజధాని కాబూల్ సహా అఫ్ఘానిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన అనేక ఉగ్ర దాడుల వెనుక ఈ హక్కానీ నెట్‌వర్క్ హస్తం ఉంది. కాగా,2012లో హక్కానీ నెట్ వర్క్ ని అమెరికా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇదొక ఉగ్రసంస్థ అని పేర్కొంటూ హక్కానీ నెట్ వర్క్ ని అమెరికా బ్యాన్ చేసింది. అయితే త్వరలో అప్ఘానిస్తాన్ లో ఏర్పాటుకానున్న తాలిబన్ ప్రభుత్వంలో హక్కానీ నెట్ వర్క్ పాత్ర..అఫ్ఘానిస్తాన్ పై అంతర్జాతీయ ఆంక్షల విధించే పరిస్థితులకు దారితీసే అవకాశముంది. సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్ హక్కానీ.