టిఫిన్ చేస్తుండగా పేలిన బాంబు : తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 01:31 PM IST
టిఫిన్ చేస్తుండగా పేలిన బాంబు : తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత

Updated On : April 21, 2019 / 1:31 PM IST

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి అనంతపురం వాసులు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురంకి చెందిన టీడీపీ నేత, ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అలిమినేని సురేంద్రబాబు బృందం విహారయాత్రకి కొలంబో వెళ్లింది. సురేంద్రబాబు తన నలుగురు స్నేహితులతో కలిసి షాంగ్రిలా హోటల్ లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. దీంతో హోటల్ లో ఉన్న వారు భయాందోళన చెందారు. హోటల్ నుంచి బయటకు పరుగుతీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. తోపులాటలో హోటల్‌ అద్దం తగిలి సురేంద్ర బాబు ముక్కుకి స్వల్ప గాయమైంది. సురేంద్రబాబు బృందం మూడు రోజుల క్రితమే కొలంబోకి వెళ్లింది. సురేంద్రబాబు, ఆయన అనుచరుల పాస్ పోర్టులు, ఇతర పత్రాలు హోటల్ గదిలోనే ఉండిపోయాయి.

సురేంద్ర బాబు తన స్నేహితులు, బంధువులతో కలిసి కొలంబోకి విహారయాత్రకు వెళ్లారు. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఆయన అక్కడ చిక్కుకుపోయారు. సురేంద్రబాబు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తెలియక ఆయన బంధువులు ఆందోళన చెందుతున్నారు. సురేంద్రబాబుని క్షేమంగా భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సురేంద్రబాబు, ఆయనతో పాటు ఉన్నవారి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. దీంతో బంధువుల్లో ఆందోళ నెలకొంది. ప్రస్తుతం శ్రీలంకలోని సెల్‌ టవర్లు పనిచేయకపోవడంతో వారిని సంప్రదించే వీలు లేదని అధికారులు చెప్పారు.

క్రిస్టియన్లు పవిత్ర భావించే ఈస్టర్‌ పండుగ రోజున కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. శ్రీలంకకు ఉగ్ర ముప్పు ఉందని 10 రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్‌ సంస్థకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నివేదికలు పంపారు. నేషనల్‌ తోహీత్‌ జామాత్‌(ఎన్‌టీజే) అనే సంస్థ ప్రముఖ చర్చిలతో పాటు కొలంబోలోని ఇండియన్‌ హైకమిషన్‌ కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఛాన్స్‌ ఉందని హెచ్చరికలు చేశారు. బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాడికల్‌ ముస్లిం గ్రూప్‌ ఎన్‌టీజే 2018లో వెలుగులోకి వచ్చింది. దాడులు జరగడానికి 10 రోజుల ముందే సమాచారం ఉన్నప్పటికీ నిఘా అధికారులు దేశవ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పేలుళ్ల సమాచారం ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం కచ్చితంగా నిఘా వైఫల్యమే అంటున్నారు.