Marburg Virus
Marburg virus : ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. మరోవైపు మంకీపాక్స్ భయపెడుతోంది. రెండు వైరస్‌ల దాడి కొనసాగుతుండగానే…తాజాగా మరో మహమ్మారి కలకలం రేపుతోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది.
కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప్రాణాంతక వైరస్ నిర్థారణ అయినట్లు తెలిపింది. నిజానికి ఈనెల 10న మార్బర్గ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ సెనెగల్ లోని ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు WHO ప్రకటించింది. సెనెగల్ లోని ఇన్ స్టిట్యూట్ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది.
మరోవైపు… ఈ కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టారు. బాధితులతో కలిసిన 98 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని చెప్పారు.
మార్బర్గ్ వైరస్ ఎబోలాకు చెందిన అంటువ్యాధి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వ్యక్తిలో ప్రవేశించిన తర్వాత రెండు నుంచి 21 రోజులపాటు శరీరంలో ఉంటుందని తెలిపారు.