Guinness World Record
Guinness World Record : అరకిలో చీజ్ ఇచ్చి మీరు తినగలరా? అని ఎవరైనా ఛాలెంజ్ విసిరితే మీరు తినగలరా? ఆలోచిస్తారు కదా.. యూరోపియన్ లేడీ లేహ్ షట్కేవర్ అలా కాదు. క్షణాల్లో తినేస్తుంది. తాజాగా అరకిలో చీజ్ తిని వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ ఒక్క రికార్డే కాదు ఆమె ఖాతాలో 33 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ ఉన్నాయట.
లేహ్ షట్కేవర్.. చీజ్ ఛాలెంజ్ స్వీకరించడమే కాదు.. కేవలం నిముషం 2.34 సెకండ్లలో 500 గ్రాముల మోజారెల్లా చీజ్‌ను తినేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డ్‌కి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో లేహ్ షట్కేవర్‌కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద తెల్లటి ప్లేట్‌లో రెండు పెద్ద మోజారెల్లా చీజ్ బ్లాక్స్ కనిపిస్తాయి. టైమర్ స్టార్ట్ కాగానే ఆమె రెండిటినీ తినడం కనిపిస్తుంది. రెండో బ్లాక్ తింటున్నప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించినా రికార్డ్ మాత్రం బద్దలు కొట్టింది. తన పేరు మీద ఇప్పటికే 33 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ ఉన్నాయి. ఆమె ప్రొఫెషనల్ ఈటర్.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యాజమాన్యం ‘ 1 నిముషం 2.34 సెకండ్లలో 500 గ్రాముల మోజారెల్లా తినడానికి వేగవంతమైన సమయం’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు కాస్త అయిష్టత చూపించారు. ‘ఈ వీడియో చూసినందుకు నాకు ప్రపంచ రికార్డు ఇవ్వండి’ అని ఒకరు.. ‘ఇది చాలా అనారోగ్యకరమైనది.. మీరు రికార్డ్ కోసం ఏమైనా చేస్తారా?’ అంటూ కామెంట్లు పెట్టారు. లేహ్ షట్కేవర్ రికార్డుల కోసం చేసిన ప్రయత్నాల్లో రెండుసార్లు వామిటింగ్ చేసుకుందట. అయినా పట్టు వదలకుండా రికార్డులు సాధిస్తూ ముందుకు వెళ్తోంది.