మేము కూడా వెళ్లిపోవాలా? అమెరికాలో వేలాది మంది భారతీయుల్లో కొత్త భయం

ఈ కాలంలో వారు తమ విద్యను కొనసాగించడానికి విద్యార్థి వీసా (ఎఫ్ -1), అర్హత ఉంటే వర్క్ వీసా (H-1B వంటివి) వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న “ఇమ్మిగ్రేషన్” నిర్ణయాల వల్ల ఆ దేశంలో వేలాది మంది భారతీయులు “స్వీయ బహిష్కరణ” భయంతో జీవిస్తున్నారు. అంటే, తాము స్వచ్ఛందంగా అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ట్రంప్‌ కొత్త రూల్స్‌ వల్ల 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయులు ఇకపై కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎందుకంటే, తల్లిదండ్రులు హెచ్ 1 బీ వీసా మీద అమెరికాలో ఉంటుంటే డిపెండెంట్లుగా వారి పిల్లలకు ఆ దేశంలో ఉండే అర్హత ఉండదు. అయినప్పటికీ ఇంతకు ముందు ఉన్న నిబంధనలు సరళంగా ఉండడంతో 21 దాటినప్పటికీ వారికి గ్రేస్‌ పీరియడ్‌ ఉండేది. ఇప్పుడు ట్రంప్‌ పాలనలో మాత్రం ఆ గ్రేస్‌ పీరియడ్, ఇతర అవకాశాలు ఉండకపోవచ్చు.

తల్లి లేదా తండ్రికి హెచ్ 1 బీ వీసా ఉంటే వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు ఉండే వారికి) అమెరికా హెచ్‌-4 వీసా ఇస్తుంది. ఇలా ఆ వీసా ద్వారా మైనర్లుగా ఉన్నప్పుడు అమెరికాకు వెళ్లిన కొన్ని వేల మంది భారతీయులు ఇప్పుడు భయపడిపోతున్నారు. తమకు 21 ఏళ్ల వచ్చిన తర్వాత అమెరికాను వదిలేసి వెళ్లిపోవాల్సి ఉంటుందన్న బాధలో ఉన్నారు.

గ్రేస్ పీరియడ్ ఇక ఉండదా?
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఇటువంటి వారు 21 ఏళ్లు దాటాక చట్టబద్ధంగా అమెరికాలో ఉండటానికి కొత్త ఇమ్మిగ్రేషన్ హోదాను పొందటానికి వారికి రెండేళ్ల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో వారు తమ విద్యను కొనసాగించడానికి విద్యార్థి వీసా (ఎఫ్ -1), అర్హత ఉంటే వర్క్ వీసా (H-1B వంటివి) వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక, ఫ్యామిలీ బేస్డ్‌, ఎంపాయిమెంట్‌ బేస్డ్‌ గ్రీన్‌ కార్డులు వంటి ఇతర అమ్మిగ్రేషన్ ఆప్షన్లు కూడా వారికి ఇప్పటివరకు ఉన్నాయి.

అయితే, తాజాగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో.. ఈ రెండేళ్ల గ్రేస్‌ పీరియడ్‌ను తగ్గించడం లేదా పూర్తి తీసేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. అందుకే 21 ఏళ్లు దాటాక తమ పరిస్థితి ఏంటని అక్కడి భారతీయు విద్యార్థులు బాధపడిపోతున్నారు. తమ భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

అటువంటి వారిలో చాలా మంది ఇప్పుడు కెనడా లేదా యూకే వంటి ఇతర దేశాలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ దేశాలు ఇమ్మిగ్రేషన్‌ విషయంలో సరళమైన విధానాలను అనుసరిస్తున్నాయి.

అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్ వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే గ్రీన్ కార్డుల కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఇటువంటి గ్రీన్ కార్డ్‌ సిస్టమ్‌ అమెరికాలోని భారతీయులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

వారు గ్రీన్ కార్డులను పొందడానికి ఇతర దేశీయుల కంటే అధిక కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కారణం.. గ్రీన్‌ కార్డులు జారీ చేయడంలో అమెరికా ప్రతిదేశానికి కొన్ని పరిమితులు పెడుతుంది. అలాగే, భారతీయుల నుంచి దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో వస్తుంటాయి.

అమెరికా సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ఇటీవల 2026 ఆర్థిక సంవత్సరానికిగానూ హెచ్‌-1బీ వీసాల రిజిస్ట్రేషన్ పీరియడ్‌ను ప్రకటించింది. ఈ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగుతుంది.