ఒట్టొ మృతికి మీదే బాధ్యత : కిమ్ పై ట్రంప్ ఆగ్ర‌హం

  • Publish Date - March 2, 2019 / 11:02 AM IST

అమెరికా విద్యార్థి ఒట్టొ వాంబియార్ గూఢచర్యం ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒట్టొ వాంబియార్ ఫ్రెడరిక్ మృతి విషయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రమేయం ఉండి ఉంటే.. తప్పకుండా ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. అమెరికాలోని వర్జీనియా యూనివర్శిటీలో డిగ్రీ చదువుతున్న ఒట్టొ వాంబియార్ టూరిస్ట్ ముసుగులో ఉత్తర కొరియాలో ప్రవేశించాడని అక్కడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల నార్త్ కొరియా అధినేత కిమ్ తో ట్రంప్ అణు ఒప్పందాలపై చర్చలు జరిపిన అనంతరం ఒట్టొ  మృతిపై మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘ఒట్టొ వాంబియార్ మృతిపై కిమ్ విచారం వ్యక్తం చేశారు. ఒట్టొ మృతి విషయంలో కిమ్ ప్రమేయం ఉందంటే నమ్మలేకనున్నాను. కిమ్ మాటల్లో అదే విషయం నాతో చెప్పాడు. అదే విషయాన్ని మీడియాతో చెప్పాను’ అని  చెప్పారు. 

కిమ్ తో చర్చల అనంతరం ట్రంప్ వ్యాఖ్యలపై ఒట్టొ వాంబియార్ తల్లిదండ్రులు మండిపడ్డారు.  ట్రంప్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. తమ కుమారుడి మరణం విషయంలో ఉత్తరకొరియాను ట్రంప్ సమర్థిస్తున్నారంటూ ఒట్టో ఫ్యామిలీ విమర్శించింది. దీంతో ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన మాటలను వాంబియార్ తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. వాంబియార్ మరణం విషయంలో కిమ్ ప్రమేయం ఉంటే.. ఉత్తరకొరియా తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పరోక్షంగా కిమ్ ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. 

ఒట్టొ వాంబియార్ కుటుంబం ఎంతో గొప్పది. వాంబియార్ ఉత్తర కొరియా వెళ్లినప్పుడు అతనితో ముగ్గురు వెళ్లినట్టు గుర్తుంది. గత పాలనలో ఒట్టొ కేసు విషయంలో ఏమి చేయలేదు. చూస్తుండి పోయారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాంబియార్ హింసించి అతని మృతికి కారణమై ఉంటే.. తప్పకుండా ఉత్తరకొరియా బాధ్యత వహించాలన్నారు. 2016, జనవరి 2న ఉత్తరకొరియా ట్రిప్ కు వెళ్లినప్పుడు ఒట్టొ ను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. 

15 ఏళ్ల కఠిన శిక్ష విధించారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా జూన్ 12, 2017లో ఒట్టోను విడుదల చేశారు. అనారోగ్యం విషయాన్ని బయటపెట్టకపోవడంతో అతడి బ్రెయిన్ తీవ్రంగా దెబ్బతిని కోమాలోకి వెళ్లాడు. యూఎస్ వెళ్లిన  తర్వాత ఒట్టొ వాంబియార్ జూన్ 19, 2017లో మృతిచెందాడు.