Amazon New Rule: అమెజాన్ కొత్త రూల్.. ఇక నుంచి లెక్క చెప్పాల్సిందే..! తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..
ఇదొక్కటే కాదు ఇంకా అనేక కొత్త రూల్స్ తెచ్చింది అమెజాన్. రిటైల్ విభాగంలోని ఉద్యోగులు బిజినెస్ ట్రిప్ లకు వెళ్లాలంటే దాని వల్ల కంపెనీకి వచ్చే లాభాలు..

Amazon New Rule: ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ కాస్ట్ కట్టింగ్ పై బాగానే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదే ఫోన్ యూజ్ పాలసీ. ఆ రూల్ ప్రకారం.. ఇకపై కంపెనీ అందించిన ఫోన్లను ఉద్యోగులు ఎంతమేరకు వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారో లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కొత్త నిబంధన ప్రకారం.. కంపెనీ ఇచ్చిన ఫోన్లను బిజినెస్ కి ఎంత శాతం వాడారో, సొంతానికి ఎంత శాతం ఉపయోగించారో అన్నది అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉద్యోగులు ప్రతి నెల తెలపాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే 50 డాలర్ల నెలవారీ రీయింబర్స్‌మెంట్‌లో సర్దుబాట్లు చేయనున్నారు. అంటే, వ్యక్తిగత వాడకం పెరిగితే రీయింబర్స్‌మెంట్ తగ్గుతుందన్న మాట. సీఈఓ ఆండీ జాస్సీ నేతృత్వంలో కంపెనీలో కఠినమైన పని సంస్కృతిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదొక్కటే కాదు ఇంకా అనేక కొత్త రూల్స్ తెచ్చింది అమెజాన్. రిటైల్ విభాగంలోని ఉద్యోగులు బిజినెస్ ట్రిప్ లకు వెళ్లాలంటే దాని వల్ల కంపెనీకి వచ్చే లాభాలు, నిర్దిష్ట లక్ష్యాలను ముందుగానే వివరించి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోంది. అలాగే భోజన ఖర్చుల వివరాలను కూడా నమోదు చేయాల్సి వస్తోంది.
కాస్ట్ కటింగ్ పేరుతో కంపెనీ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కంపెనీ ఫోన్‌ను ఒక సాధారణ ప్రయోజనంగా భావించే ఉద్యోగులు.. ఇప్పుడు దాని వాడకంపై ఇంతలా నిఘా పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. జాబ్ సెక్యూరిటీపై ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. అయితే, ఈ రూల్స్ ను ఆండీ జాస్సీ సమర్థించుకున్నారు. ఇదే నా సొంత డబ్బ అయితే ఎలా ఖర్చు పెట్టేవాడిని? అని ప్రతి ఉద్యోగి ఆలోచించాలన్నది తన అభిమతం అని ఆయన అంటున్నారు.