Hurricane Melissa : తుపాను మధ్యలో నుంచి వెళ్లిన విమానం.. గూస్ బంప్స్ వీడియో.. తుపాను లోపల చూడండి ఎలా ఉందో…

Hurricane Melissa అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం హరికేన్ మెలిసా ఐ భాగంలోకి దూసుకెళ్లింది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Hurricane Melissa : తుపాను మధ్యలో నుంచి వెళ్లిన విమానం.. గూస్ బంప్స్ వీడియో.. తుపాను లోపల చూడండి ఎలా ఉందో…

Updated On : October 28, 2025 / 2:24 PM IST

Hurricane Melissa : కరేబియన్ దేశం జమైకాలో హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. మెలిసా తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ -5గా వర్గీకరించారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది. ప్రస్తుతం హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైంది. అయితే, ఆ హరికేన్ ను అధ్యయనం చేసేందుకు అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం సోమవారం చక్కర్లు కొట్టింది. హరికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


యూఎస్ఏఎఫ్ సీ-130జే హెరిక్యూల్స్ (టీఈఏఎల్74) విమనంలో స్టార్మ్ ఛేజర్స్ ఆ హరికేన్ వీడియోను తీశారు. పైనుంచి మహాభీకరంగా కనిపిస్తున్న హరికేన్ మధ్య భాగంలో ప్రశాంతంగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. టీఎల్ 74టీమ్ కాక్‌పిట్ పుటేజ్‌ను రిలీజ్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో తెల్లటి మేఘాలు వలయాకారంలో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన తెల్లటి మేఘాల సమూహాన్ని చీల్చుకుంటూ డబ్ల్యూసీ-130జే విమానం దూసుకెళ్లింది. కొన్ని మైళ్ల మేర ఆ మేఘాల వలయం ఉంది. ఆకాశంలో నిర్మించిన స్పోర్ట్స్ స్టేడియం పైకప్పు తరహాలో సర్క్యూర్ స్పేస్ కనిపిస్తుంది.


మెలిసా తుపాను కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లొద్దంటూ నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ డైరెక్టర్ మైఖేల్ బ్రెన్నాన్ పేర్కొన్నారు. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు. హరికేన్ తీవ్రతరం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

174 సంవత్సరాల రికార్డు చరిత్రలో కేటగిరీ 4 లేదా అంతకంటే ఎక్కువ తుఫాను జమైకాను తాకలేదు. 1988లో హరికేన్ గిల్బర్ట్ ఆ ద్వీపాన్ని తాకినప్పుడు అది కేటగిరీ 3 తుఫాను. ఇవాన్ మరియు బెరిల్ తుఫానులు రెండూ కేటగిరీ 4కి చెందినవి, కానీ అవి తీరాన్ని తాకలేదు.