అమెరికాలోని అతిపెద్ద ఇంధన పైప్‌లైన్‌ సిస్టమ్ పై సైబర్ దాడి..ఎమర్జెన్సీ విధించిన బైడెన్ సర్కార్

అమెరికాలోని క‌లోనియ‌ల్ పైప్‌ లైన్ కంపెనీపై సైబ‌ర్ దాడి జ‌రిగింది.

అమెరికాలోని అతిపెద్ద ఇంధన పైప్‌లైన్‌ సిస్టమ్ పై సైబర్ దాడి..ఎమర్జెన్సీ విధించిన బైడెన్ సర్కార్

Cyberattack

Updated On : May 10, 2021 / 3:48 PM IST

cyberattack అమెరికాలోని క‌లోనియ‌ల్ పైప్‌ లైన్ కంపెనీపై సైబ‌ర్ దాడి జ‌రిగింది. సంస్థ యొక్క 100 జీబీ డాటాను హ్యాక‌ర్లు స్వాధీనం చేసుకున్నారు. మాల్వేర్‌ ను ప్ర‌యోగించ‌డం ద్వారా సంస్థ కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌ను చేతుల్లోకి తీసుకున్న‌ారు. తాము కోరినంత డ‌బ్బు ముట్ట‌జెప్పాల‌ని, లేనిపక్షంలో డాటాను ఇంట‌ర్నెట్‌లో విడుద‌ల చేస్తామ‌ని హ్యాక‌ర్లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కలోనియల్‌ పైప్‌లైన్‌లోని ఒకరి అకౌంట్‌ లాగిన్‌ లేదా టీమ్‌వ్యూయర్‌ వంటి రిమోట్‌ డెస్క్‌టాప్‌ సాఫ్ట్‌వేర్‌ వివరాలను సంపాదించి దాడి చేసినట్లు భావిస్తున్నారు.

తూర్పు తీర ప్రాంతంలో ఇంధన సరఫరాలో ఈ పైప్‌లైన్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది టెక్సాస్‌ నుంచి న్యూజెర్సీ వరకు దాదాపు 5,500 మైళ్లు చమురును సరఫరా చేస్తుంది. నిత్యం 25 లక్షల బ్యారళ్ల పెట్రోల్‌, డీజిల్‌, వైమానిక ఇంధనాన్ని సరఫరా చేస్తుంటుంది. ఇది తూర్పుతీరం వినియోగించే దానిలో 45శాతానికి సమానం. శుక్రవారం దాడి చేసిన సైబర్‌ క్రిమినల్‌ గ్యాంగ్‌ దీనిని పూర్తిగా మూసివేసింది.

దీంతో మొత్తం 18 రాష్ట్రాలపై దీని ప్రభావం పడనుంది. అలబామా, అర్కాన్సస్‌, డిస్ట్రిక్‌ ఆఫ్‌ కొలంబియా,డెలావేర్‌,ఫ్లోరిడా,జార్జియా,కెంటకీ,లూసియానా,మేరీల్యాండ్‌,మిస్సిసిపీ,న్యూజెర్సీ,న్యూయార్క్‌,నార్త్‌కరోలినా,పెన్సిల్వేనియా,దక్షిణ కరోలినా,టెన్నెస్సీ,టెక్సాస్‌,వర్జీనియా రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. రోడ్డుమార్గంలో అత్యవసరంగా చమురు రవాణా చేయడానికి ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అనుమతులు ఇచ్చింది. ఈ సైబర్‌ దాడి కారణంగా అమెరికాలో చమురు ధరలు 2-3శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పైప్‌లైన్ ఎక్కువ రోజులు ప‌నిచేయ‌కుండా పోతే అది మ‌రింత‌ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అమెరికా ప్ర‌భుత్వం ద‌ర్యాప్తును ప్రారంభించింది. అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్‌లైన్‌ సిస్టమ్ పై సైబర్ దాడితో ఆదివారం జో బైడెన్ ప్ర‌భుత్వం రీజినల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

కరుడుగట్టిన సైబర్‌ నేరగాళ్ల ముఠా ‘ది డార్క్‌సైడ్‌’ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇది రష్యాకు చెందిన సంస్థగా అనుమానిస్తున్నారు. ఇదొక రాన్సమ్‌వేర్‌ ముఠా. అంటే సైబర్‌ దాడి చేసి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్‌. తాజా దాడిలో డార్క్‌సైడ్‌ ముఠా.. కలోనియల్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 100 గిగాబైట్ల డేటాను తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిని గుర్తించిన కలోనియల్‌ సంస్థ మిగిలిన డేటా హ్యాకర్లు బారినపడకుండా ఆఫ్‌లైన్‌ చేసింది.

ర్యాన్‌స‌మ్‌వేర్ అనేది ఒక‌రక‌మైన మాల్వేర్‌. క్రిమినల్‌ ఐటీ వ్యవస్థలో రాన్సమ్‌వేర్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది దొంగిలించిన డేటాను ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా పబ్లిష్‌ చేసేందుకు సిద్ధంగా ఉంచి.. ఆధారాలతో ఉన్న ఆ లింక్‌ను బాధితులకు పంపిస్తుంది. బాధితుడి సిస్టమ్‌లోని డేటాను ముందే తొలగించేస్తుంది. తమకు డబ్బు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకొన్న డేటా లీక్‌ చేస్తామని చెబుతుంది. డార్క్‌సైడ్‌ ముఠా సైబర్‌ నేరాల్లో శిక్షణ కూడా ఇస్తుంటుంది. డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసి తస్కరించేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేస్తింది. దీంతో దాడులు ఎలా చేయాలి.. డబ్బు ఎలా గుంజాలో అన్న అంశంపై తమ అనుచర బృందాలకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన బృందాలు సైబర్‌ దాడులు చేసి వసూలు చేసిన సొమ్ములో కొంత డార్క్‌సైడ్‌కు చెల్లిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరింత చురుగ్గా దాడులు చేసే ఓ సాఫ్ట్‌వేర్‌ను డార్క్‌సైడ్‌ ముఠా మార్చిలో సిద్ధం చేసింది. దీనిని పరిశీలించడానికి రావాలని జర్నలిస్టులకు ఓ ప్రెస్‌నోట్‌ కూడా విడుదల చేయడం విశేషం.