US Iran Talks: పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు..! సర్వత్రా ఉత్కంఠ..
అమెరికాకు ఏం చెప్పాలనుకున్నా పాక్ కే చెప్తామని, ఆ విషయాలు పాక్ అమెరికాకు చెబుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
US Iran Talks: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ వేదికగా మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ బృందం పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ బృందం పాకిస్తాన్ చేరుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, మంత్రి మోహ్సిన్ నఖ్వీతో పాటు పలువురు ఇరాన్ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. అటు అమెరికా బృందం కూడా చేరుకునే అవకాశం ఉంది.
ఇక రెండో దశ చర్చల్లో ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. ఈ సంక్షోభ నివారణ కోసం పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఇరాన్ ప్రశంసించింది. అటు ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎలాంటి ప్రణాళికలు ఉండనట్లు తెలుస్తోంది. దానికి బదులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ బృందం పాక్ ఉన్నతాధికారులతోనే సమావేశం కానుంది. అమెరికాకు ఏం చెప్పాలనుకున్నా పాక్ కే చెప్తామని, ఆ విషయాలు పాక్ అమెరికాకు చెబుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్ భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్ కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ తో చర్చల కోసం పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక చర్చల వేళ పాక్ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు.
ఈసారైనా శాంతి ఒప్పందం కుదిరేనా?
ఏప్రిల్ 11, 12 తేదీలలో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య మంగళవారమే మరో విడత శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ, చర్చల్లో పాల్గొనేందుకు తాము ఇంకా సిద్ధంగా లేము అని ఇరాన్ తెలపటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ నుంచి కదల్లేదు. మంగళవారం రద్దైన చర్చలు ఇప్పుడు మళ్లీ పాక్ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చల్లోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ రద్దు.. డిపాజిట్ డబ్బులు తిరిగి ఇస్తారా?
