Strait of Hormuz: ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముదురుతుండటంతో.. అంతర్జాతీయ చమురు సంస్థల్లో భయం మొదలైంది. తమ వ్యాపార జీవనాడిని ఇరాన్ ఎక్కడ మూసి వేస్తుందోనని కంగారు పడుతున్నాయి. అసలు చమురు సంస్థల జీవనాడి ఏంటి? దాన్ని మూసివేస్తే వాటికి కలిగే నష్టం ఏంటి?
ఇరాన్, ఇజ్రాయల్ యుద్ధం గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటి ఓ జలసంధి మూతపడే ప్రమాదం ఉందని చమురు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతోంది. అదే హర్మూజ్ జలసంధి.
పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించడానికి హర్మూజ్ ఏకైక సముద్ర ప్రవేశ మార్గం. ఇది ఒక వైపు ఇరాన్‌ను, మరోవైపు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను విభజిస్తుంది. ఇది పెర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్ తో, హిందూ మహా సముద్రాన్ని అరేబియా సముద్రంతో లింక్ చేస్తుంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదేనని చెబుతున్నాయి. ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకుని ఇరాన్ సమీపం నుంచి హర్మూజ్‌ను దాటి బయటకు వస్తాయి.
US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుంచి ప్రవహిస్తుంది. “ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు రవాణా చోక్‌పాయింట్”గా దీన్ని అభివర్ణిస్తారు. అత్యంత ఇరుకైన ప్రదేశంలో ఇది 33 కి.మీ (21 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. కానీ జలమార్గంలో షిప్పింగ్ లేన్లు మరింత ఇరుకైనవి. దీనివల్ల అవి దాడులు, మూసివేయబడే బెదిరింపులకు గురవుతాయి.
1980 నుంచి 1988 మధ్య ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఇరువైపులా లక్షలాది మంది మరణించారు. రెండు దేశాలు గల్ఫ్‌లోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయి. పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకున్నాయి. దీన్ని ట్యాంకర్ యుద్ధం అని పిలుస్తారు. కానీ హర్మూజ్ ఎప్పుడూ పూర్తిగా మూసివేయబడలేదు.
Also Read: అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకిన ఇరాన్ మిస్సైల్.. దెబ్బతిన్న ఎంబసీ..
ఇటీవల, 2019లో, డొనాల్డ్ ట్రంప్ మొదటి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, యుఎఇలోని ఫుజైరా తీరంలో జలసంధి సమీపంలో నాలుగు నౌకలపై దాడి జరిగింది. ఈ సంఘటనకు వాషింగ్టన్ టెహ్రాన్‌ను నిందించింది. ఇరాన్ ఆ ఆరోపణలను ఖండించింది.
హర్మూజ్ జల సంధి మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుంద. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా ఇది అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్ ఎగుమతి చేస్తుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
భారత్ కు సరఫరా అయ్యే చరుములో 40 శాతం ఈ మార్గం నుంచే రవాణ అవుతోంది. ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. మన దేశం వినియోగించే ఇంధనంలో 90 శాతం వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగిపోవడం ఖాయం. భారత ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మళ్లీ దారుణంగా మారే అవకాశం ఉంది. వివిధ దేశాలతో మనకున్న చమురు ఒప్పందాలకు తోడు.. మనకున్న వ్యూహాత్మక నిల్వలు 74 రోజులకు సరిపోతాయి.
ఎన్ని ఉద్రిక్తతలు ఏర్పడినా ఇప్పటివరకు ఇరాన్ ఈ జలసంధిని మూసింది లేదు. టెహ్రాన్ ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుంది. ఒక వేళ హర్మూజ్‌ను మూస్తే దాని ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది.