Israel Iran War: అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకిన ఇరాన్ మిస్సైల్.. దెబ్బతిన్న ఎంబసీ..

తమ పౌరులపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు టెహ్రాన్‌ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయల్‌ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

Israel Iran War: అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకిన ఇరాన్ మిస్సైల్.. దెబ్బతిన్న ఎంబసీ..

Updated On : June 16, 2025 / 6:30 PM IST

Israel Iran War: ఇజ్రాయల్, ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నారు. ఇజ్రాయల్ చేసిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయల్ పై అటాక్ కు దిగింది. తాజాగా ఇరాన్ ప్రయోగించిన ఒక మిస్సైల్.. అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకింది.

ఇజ్రాయల్ పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్‌అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో అమెరికా ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్‌ హకేబీ ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇరాన్ క్షిపణి దాడిలో టెల్ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్వల్పంగా దెబ్బతినడంతో దాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ వెల్లడించారు. అలాగే జెరూసలెంలోని తమ కార్యాలయం మూసి ఉంటుందన్నారు. అమెరికా దౌత్య సిబ్బందిలో ఎవరికీ గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. సమీపంలోని పేలుళ్ల కారణంగా కాన్సులేట్ భవనం దెబ్బతింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

“ఇజ్రాయెల్‌లోని మా US రాయబార కార్యాలయం, కాన్సులేట్ ఈరోజు అధికారికంగా మూసివేయబడతాయి. టెల్ అవీవ్‌లోని ఎంబసీ బ్రాంచ్ సమీపంలో ఇరానియన్ క్షిపణి ఢీకొన్న కారణంగా కొంత నష్టం జరిగింది. US సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు” అని హకబీ ఎక్స్ లో తెలిపారు.

టెల్ అవీవ్ తీరప్రాంత కేంద్రంలోని భవనాలు దెబ్బతిన్నాయి. క్షిపణి దాడితో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సిబ్బంది అత్యవసర ప్రోటోకాల్‌ను పాటిస్తూ సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని హకబీ ఆదేశించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వారం రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఓ క్షిపణి అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకడం, కార్యాలయం ధ్వంసం కావడం ఇదే తొలిసారి.

తమ పౌరులపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు టెహ్రాన్‌ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయల్‌ రక్షణ మంత్రి ఖట్జ్‌ వార్నింగ్ ఇచ్చారు. గత రాత్రి ఆ దేశం చేసిన దాడిలో ఐదుగురు మరణించగా, డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారని తెలిపారు. కాగా, ఇరాన్‌ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఇజ్రాయల్‌ చెప్పింది.

Also Read: జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ.. రెండు దశల్లో నిర్వహణ

ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో సెంట్రల్‌ ఇజ్రాయల్‌లోని పవర్‌ గ్రిడ్‌ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ దేశ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వెల్లడించింది. కీలక ఓడరేవు నగరమైన హైఫా లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తోంది. చమురు నిల్వలు, ఇతర భవనాలను టార్గెట్ చేసింది. అక్కడి రిఫైనరీపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది.

ఇరాన్‌లోని అంతర్గత సైనిక లక్ష్యాలను ఇజ్రాయల్ ధ్వంసం చేసిన తర్వాత, సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయల్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇరుపక్షాలు మరింత విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉంది. ఇరాన్ చేసిన దాడిలో ఐదుగురు మరణించారని, 92 మంది గాయపడ్డారని ఇజ్రాయల్‌కు చెందిన మాగెన్ డేవిడ్ అడోమ్ అత్యవసర సేవ తెలిపింది.