Census: జనగణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ.. రెండు దశల్లో నిర్వహణ
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.

Census Notification 2025: దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణన ప్రక్రియ జరగనుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కుల గణననూ కేంద్రం నిర్వహించనుంది.
దేశంలో 15ఏళ్ల తరువాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇది మొత్తంగా 16వ.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చేపట్టబోయే 8వ జనగణన. అయితే, తొలిసారిగా జనగణనతో పాటే కేంద్రం కులగణన చేయనుంది. రెండు విడతల్లో నిర్వహించనున్న ఈ జనగణన ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో 2026 అక్టోబర్ 1 నాటికి జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జనగణను పూర్తి చేయనుంది. మార్చి 2027 నాటికి మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది.
జనగణన నిర్వహణ కోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. అంతేకాదు.. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్ లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పించారు. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.