అంతరిక్షానికి ప్రయాణించిన మొట్టమొదటి “వీల్‌చైర్‌ యూజర్‌” ఈమె.. అంతటి ఘనత ఎలా సాధించిందంటే?

బెంట్‌హౌస్‌కు 2018లో మౌంటెన్ బైకింగ్ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతింది. ఆ తరువాత వీల్‌చైర్‌కే పరిమితమై ఇంజినీరింగ్, పరిశోధనపై దృష్టి పెట్టింది.

అంతరిక్షానికి ప్రయాణించిన మొట్టమొదటి “వీల్‌చైర్‌ యూజర్‌” ఈమె.. అంతటి ఘనత ఎలా సాధించిందంటే?

Michaela Benthaus

Updated On : December 21, 2025 / 6:01 PM IST

Michaela Benthaus: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ఏరోస్పేస్, మెకాట్రానిక్స్ ఇంజినీరుగా పనిచేస్తున్న జర్మన్ మహిళ మికాయెలా బెంట్‌హౌస్ (33) అంతరిక్ష యాత్ర చేసిన మొట్టమొదటి “వీల్‌చైర్‌ యూజర్‌”గా చరిత్ర సృష్టించారు. సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కర్మన్ లైన్‌ను దాటి ప్రయాణించి వచ్చారు. కర్మాన్ లైన్ అంటే భూమి వాతావరణం ముగిసే స్థాయిగా భావించే అంతరిక్ష సరిహద్దు.

బ్లూ ఒరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ క్యాప్సూల్‌లో మికాయెలా బెంట్‌హౌస్ (Michaela Benthaus) అంతరిక్ష యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. టెక్సాస్ రాష్ట్రంలోని వాన్ హోర్న్ సమీపంలోని ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరిగింది.

ఈ మిషన్‌కు ఎన్‌ఎస్-37 అని పేరు. ఇది బ్లూ ఒరిజిన్ నిర్వహించిన 16వ సబ్‌ఆర్బిటల్ అంతరిక్ష పర్యాటక ప్రయోగం. సబ్‌ఆర్బిటల్ అంటే భూమి చుట్టూ పూర్తిగా తిరగకుండా కొంత ఎత్తుకు వెళ్లి, తిరిగి భూమికి చేరే అంతరిక్ష ప్రయాణం. 2000 సంవత్సరంలో బ్లూ ఒరిజిన్‌ను స్థాపించారు. దీని లక్ష్యం సాధారణ వ్యోమగాముల్లా కాకపోయినా ఎక్కువ మందికి అంతరిక్ష ప్రయాణాన్ని చేరువ చేయడమే.

Also Read: రైలు టికెట్ చార్జీల పెంపు.. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

“నాకు ఎప్పటినుంచో అంతరిక్షానికి వెళ్లాలనే కోరిక ఉంది. కానీ, అది నిజంగా సాధ్యమని ఎప్పుడూ అనుకోలేదు. కాలు కోల్పోయినా కొద్దిగా నడవగలిగే వాళ్లకే అంతరిక్ష ప్రయాణం సాధ్యమని అనుకున్నాను” అని మికాయెలా బెంట్‌హౌస్ ప్రయాణానికి ముందు తెలిపారు.

ఆమెకు వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉంది. దీన్ని అతిపెద్ద అంగవైకల్యమని తాను భావించానని, అయినప్పటికీ అంతరిక్ష ప్రయాణం సాధ్యమైందని మికాయెలా బెంట్‌హౌస్ చెప్పారు.

ఎన్నో సాహస ఈవెంట్లు చేసే బెంట్‌హౌస్‌కు 2018లో మౌంటెన్ బైకింగ్ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతింది. ఆ తరువాత వీల్‌చైర్‌కే పరిమితమై ఇంజినీరింగ్, పరిశోధనపై దృష్టి పెట్టింది.

న్యూ షెపర్డ్ యాత్ర సుమారు 10 నిమిషాలు సాగింది. మికాయెలా బెంట్‌హౌస్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులను కర్మాన్ లైన్ దాటివచ్చారు. శబ్ద వేగానికి మూడింతలు మించి రాకెట్‌ దూసుకెళ్లింది.

మైక్రోగ్రావిటీ (బరువు లేనట్టు అనిపించే స్థితి) సమయంలో కాళ్లు కట్టుకునేందుకు ప్రత్యేక పట్టీ వాడతానని బెంట్‌హౌస్ తెలిపారు. ఆ పట్టీ చాలా బాగా పనిచేసిందని శనివారం క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలిపారు. ఇంతకుముందు ప్యారబాలిక్ శిక్షణ ప్రయాణంలో కూడా మైక్రోగ్రావిటీని అనుభవించానని ఆమె చెప్పారు.

న్యూ షెపర్డ్ యాత్రలో తీవ్రమైన జీ ఫోర్సులు (శరీరంపై పడే వేగం, గురుత్వాకర్షణ ఒత్తిడి కొలిచే విధానం) కూడా ఎదురవుతాయి. క్యాప్సూల్ దిగివచ్చే సమయంలో 5 జీల వరకు ఒత్తిడి ఉంటుంది.