పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్‌ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..

ఆ ఉగ్రవాదికి పాక్ ప్రభుత్వం భద్రత కూడా కల్పిస్తుంది.

పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్‌ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..

Updated On : May 18, 2025 / 7:58 PM IST

భారత్‌లో మూడు భారీ ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా నేత సైఫుల్లా ఖలీద్ అలియాస్ రజావుల్లా నిజామనీ హతమయ్యాడు. సైఫుల్లాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఉగ్రవాదికి పాక్ ప్రభుత్వం భద్రత కూడా కల్పిస్తుంది.

అతడు మట్లీలోని తన ఇంటి నుంచి ఇవాళ మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ చౌరస్తా వద్దకు చేరుకున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపారు.

Also Read: ట్రంప్ సలహాదారుల్లో ఇద్దరు జిహాదిస్టులు.. వారిలో ఒకడు అప్పట్లో భారత్‌పై..

భారత్‌లోని నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి ఘటనలో సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అలాగే, రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై 2001లో జరిగిన దాడి వెనక అతడి హస్తం ఉంది. బెంగళూరులోని ఐఐఎస్‌సీపై 2005లో జరిగిన దాడుల వెనుక కూడా అతడు ఉన్నాడు.

“వినోద్ కుమార్” అనే మారుపేరుతో నకిలీ గుర్తింపు కార్డుతో ఖలీద్ చాలా సంవత్సరాలు నేపాల్‌లో ఉన్నాడు. స్థానిక మహిళ నగ్మా భానును వివాహం చేసుకున్నాడు. నేపాల్ నుంచి అతడు ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్‌ సప్లైలో కీలక పాత్ర పోషించాడు.

కొంత కాలం క్రితం ఖలీద్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాదిన్ జిల్లాలోని మట్లీకి వచ్చి అక్కడి ఇంట్లో ఉంటున్నాడు. లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా కోసం పని చేస్తూనే ఉన్నాడు. ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకాలు, నిధుల సేకరణపై దృష్టి సారించాడు.