ట్రంప్ సలహాదారుల్లో ఇద్దరు జిహాదిస్టులు.. వారిలో ఒకడు అప్పట్లో భారత్‌పై..

అల్హమ్ది అనే ఒక వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడటానికి రాకెట్ గ్రెనేడ్‌ను ఎలా వాడాలో నేర్చుకున్నాడు. 

ట్రంప్ సలహాదారుల్లో ఇద్దరు జిహాదిస్టులు.. వారిలో ఒకడు అప్పట్లో భారత్‌పై..

Donald Trump

Updated On : May 18, 2025 / 6:54 PM IST

ఒకప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వైట్ హౌస్‌ అడ్వైజరీ బోర్డులో నియమించుకున్నారు. వారి పేర్లు రోయర్, షేక్ హమ్జా యూసఫ్‌. రోయర్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేశాడని, కశ్మీర్‌లో జరిగిన దాడులతో అతడికి సంబంధం ఉందని తెలుస్తోంది.

ఇస్మాయిల్ రోయర్ 2000లో పాకిస్థాన్‌లో ఎల్‌ఈటీ శిక్షణా శిబిరానికి వెళ్లాడు. కశ్మీర్‌లో భారత భద్రతా దళాలపై కాల్పుల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. ఉగ్రవాద సంస్థలకు సాయం చేసినందుకు అమెరికా కోర్టు అతడిని 2004లో దోషిగా నిర్ధారించింది. అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 13 సంవత్సరాలు జైలులో ఉండి బయటకు వచ్చాడు.

ట్రంప్‌ మద్దతుదారు లారా లూమర్ అనే మహిళ దీనిపై స్పందిస్తూ.. జిహాదిస్టులు రోయర్, షేక్ హమ్జా యూసఫ్‌ను వైట్ హౌస్‌ అడ్వైజరీ బోర్డులో నియమించుకున్నారని, ఇది సరికాదని అన్నారు. రోయర్, షేక్ హమ్జా యూసఫ్‌కు ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉందని ఆమె అన్నారు.

Also Read: షాకింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

లారా లూమర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోయర్ అసలు పేరు రెండెల్ రోయర్. అతడు 2000 సంవత్సరంలో ఇస్లాం మతంలోకి మారాడు. “వర్జీనియా జిహాదీ నెట్‌వర్క్” అనే గ్రూపులో అతడు సభ్యుడు. ఎఫ్‌బీఐ అతడిపై దర్యాప్తు చేపట్టింది. 2003లో అల్ ఖైదా, లష్కరే తోయిబాకు సాయం చేసినందుకు అతడిపై అభియోగాలు నమోదు చేసింది. 2004లో అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు సహకరించానని అన్నాడు. శిక్షణా శిబిరానికి వెళ్లడానికి పలువురికి సాయం చేశానని తెలిపాడు. అతడి నుంచి సాయం పొందిన వ్యక్తులు తుపాకులు, పేలుడు పదార్థాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. అల్హమ్ది అనే ఒక వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడటానికి రాకెట్ గ్రెనేడ్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు. ఇందుకోసం అతడికి రోయర్ సాయం చేశాడు. ఇప్పుడు రోయర్ రిలిజియస్ ఫ్రీడమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇస్లాం, రిలిజియస్ ఫ్రీడమ్ టీమ్ డైరెక్టర్‌గా రోయర్ పనిచేస్తున్నాడు.

ఇక వైట్ హౌస్‌ అడ్వైజరీ బోర్డుకి ఎంపికైన రెండో వ్యక్తి షేక్ హమ్జా యూసఫ్‌. అతడు అమెరికాలోని మొదటి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజ్ జైతునా కళాశాల సహ వ్యవస్థాపకుడు. అతడు కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్‌కు కూడా సలహాదారుడిగా ఉన్నాడు. ఇతడికి కూడా జిహాదీ భావజాలం ఉందని లారా లూమర్ తెలిపారు. అతడి గురించి మరిన్ని వివరాలు తెలపలేదు. షేక్ హమ్జా యూసఫ్‌ ఉగ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు లేనట్లు తెలుస్తోంది.