కరోనా వైరస్ తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దశ ‘సెకండ్ పీక్’ కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముందుగానే హెచ్చరిస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్లు కాస్తా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వెంటనే రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభమవుతుందని అలర్ట్ చేస్తోంది. ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుందని WHO గట్టిగానే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తొలి దశ మధ్యకు చేరుకుందని WHO అత్యవసర విభాగ అధికారి డాక్టర్ మైక్ రయాన్ తెలిపారు. ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయని, కానీ, సెంట్రల్, సౌత్ అమెరికా, సౌత్ ఏసియా, ఆఫ్రికాల్లో మాత్రం ఇంకా కరోనా కేసులు తీవ్రంగానే ఉన్నాయని మైక్ తెలిపారు.
వైరస్ మహమ్మారులు తరచుగా కొన్ని తరంగాలుగా మారుతూ వస్తుంటాయి. ఈ ఏడాదిలో తొలి దశ కొనసాగుతుండగానే.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో రెండో దశ కరోనా విజృంభించనుంది. తొలి దశ ఎత్తివేసిన వెంటనే తక్షణమే మళ్లీ కరోనా కేసులు విస్తృత స్థాయిలో విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి వైరస్ అనేది ఎప్పుడైనా ఆకస్మాత్తుగా రూపాంతరం చెందగలదు. వ్యాధి తీవ్రత తగ్గిపోయిందని నొక్కి చెప్పలేమన్నారు. తగ్గినట్టే తగ్గిన వైరస్ మళ్లీ హఠాత్తుగా రెండో తరంగంలా ఎగసి పడొచ్చునని హెచ్చరించారు.
యూరప్, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికీ ప్రజా ఆరోగ్యం, భౌతిక దూరం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పరీక్షలు చేయడం, సమగ్రమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాబోయే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యపడుతుందని మైక్ సూచించారు. ఇటీవల వారాల్లో చాలా యూరోపియన్ దేశాలు, అమెరికా రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేవేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చినప్పటికీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడానికి కారణమైంది.
Read: మాజీ క్రికెటర్ కు కరోనా, తన కోసం ప్రార్థించాలని రిక్వెస్ట్