Israel Hamas Conflict: గాజాను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్‌కు హమాస్ చెరలో ఉన్న తన బందీలను విడిపించడం ఎందుకు అంత పెద్ద సవాలుగా మారింది?

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో ఇప్పటివరకు 18 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, అక్టోబర్ 7నే హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు.

Israel Hamas Conflict: గాజాను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్‌కు హమాస్ చెరలో ఉన్న తన బందీలను విడిపించడం ఎందుకు అంత పెద్ద సవాలుగా మారింది?

Updated On : December 21, 2023 / 3:54 PM IST

ఇజ్రాయెల్, గాజా మధ్య గత 72 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ దాదాపుగా ధ్వంసం చేసింది. గాజాలో ఉన్న హమాస్ యోధులను పూర్తిగా నిర్మూలించాలని ఇజ్రాయెల్ ప్రధాని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం గాజాలో తెల్లటి గుడ్డ ఊపుతున్న ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కాల్చి చంపింది. ఇక్కడే ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది.

ఇజ్రాయెల్ సైన్యం కాల్చిన ఈ ముగ్గురిని హమాస్ యోధులుగా పరిగణించింది. వాస్తవానికి వారు హమాస్ చేత బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు. ఈ బందీలను యోతమ్ హైమ్ (28), సమీర్ తలాల్కా (22), అలోన్ షమ్రిజ్ (26)గా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత ఒక ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి స్పందిస్తూ ఇది ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకమని అన్నారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. ఈ చర్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం, ప్రధాని నెతన్యాహు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో సైనిక చర్య ద్వారా గాజా స్ట్రిప్‌లోని బందీలను రక్షించడం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎంత ప్రమాదకరమైన సవాలో ఈ చర్య రుజువు చేస్తున్నది.

గాజాలో 120 మంది ఇజ్రాయెల్ బందీలు
ప్రస్తుతం 120 మంది ఇజ్రాయెల్ పౌరులు గాజా స్ట్రిప్‌లో బంధీలుగా ఉన్నారు. ముగ్గురు బందీలను కాల్చివేసినప్పుడు, ఇజ్రాయెల్ సైన్యం తాము పొరపాటు చేశామని ఒప్పుకుంది. అయితే ఈ బందీల వల్ల తమకు బెదిరింపు ఉందని తాము భావించామని, అందుకే వారిని కాల్చి చంపినట్లు తెలిపింది. ఈ బందీలు హమాస్ ఆక్రమణ నుంచి తప్పించుకున్నారని లేదా వారితో తీసుకెళ్లిన యోధులు వారిని అక్కడ వదిలిపెట్టారని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, హమాస్‌తో బందీలను విడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి వస్తోంది.

ఇది కూడా చదవండి: అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం

ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పుడు బందీలు తిరిగి రావడం గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. హమాస్ చెరలో ఉన్న వారి కుటుంబాల ఆందోళన కూడా పెరిగింది. ఈ కేసు తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విలేకరుల సమావేశం నిర్వహించి, హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఎటువంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు. బందీల విడుదల కోసం సైన్యంపై ఒత్తిడిని కొనసాగించడం అవసరమేనని, అయితే ఈ ఒత్తిడిని కొనసాగించడం తప్ప మాకు వేరే పరిష్కారం లేదని అన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ తన ప్రజలపై దాడులను నిలిపివేసి, తన దూకుడు వైఖరిని విడనాడే వరకు, బందీలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ మధ్యవర్తులు అంటున్నారు.

బందీలను విడిపించడంలో ఇజ్రాయెల్ ముందున్న సవాలు ఏమిటి?
హమాస్‌లో 120 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బందీలను విడుదల చేయడానికి హమాస్‌తో చర్చలు జరపాలని ఇజ్రాయెల్‌పై నిరంతరం ఒత్తిడి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిన తరువాత, బందీలను విడుదల చేయడానికి హమాస్‌తో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు చేస్తున్నాయి.

జైలులో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా 100 మంది ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయాలనేది ప్రాథమిక ఒప్పందం. హమాస్ ముందుగా కొంతమంది బందీలను విడుదల చేసింది. కానీ ఇప్పటికీ 120 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా ఉంచింది. దీంతో బందీల కుటుంబాలు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో తమవారి విడుదల కోసం నిరసనలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌తో రాజీ లేదా చర్చల గురించి ఆలోచించడం లేదు. కారణం, బందీలను రక్షించడానికి సైన్యం ప్రయత్నిస్తే, ఇంతకు ముందు జరిగిన తప్పిదం మరోసారి జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: గంటకు పైగా స్తంభించిన ‘ఎక్స్’ ‘సేవలు.. మాయమైన పోస్టులు.. ఎట్టకేలకు అందుబాటులోకి..!

తన పౌరులను, హమాస్ ఉగ్రవాదులను గుర్తించేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి సవాలుగా మారింది. భవిష్యత్తులో ఎక్కువ మంది ఇజ్రాయెల్ బందీలు చనిపోతే, ఇజ్రాయెల్ ప్రభుత్వం తన సొంత దేశ పౌరుల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. హమాస్ చెర నుంచి ఇటీవల విడుదలైన బందీ అయిన ఇటాయ్ సివిర్‌స్కీ బంధువు నామా విన్‌బెర్గ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఏమి జరిగిందోనని తమకు చాలా భయంగా ఉంది. నిన్నటి వరకు బతికి ఉన్న బందీలు ఇప్పుడు చనిపోయారు. వారి మృతదేహాలు మాకు వద్దు. బందీలుగా ఉన్న వారందరూ తిరిగి వచ్చే వరకు యుద్ధాన్ని నిలిపివేయాలి. బందీలుగా ఉన్నవారి మృతదేహాలు రోజు రోజుకు తిరిగి వస్తున్నాయి’’ అని అన్నారు.

యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి
హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో ఇప్పటివరకు 18 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, అక్టోబర్ 7న హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి కూడా దీనిని భారీ మానవ విషాదంగా పేర్కొంది. ఆ తర్వాత అమెరికాతో సహా అనేక మిత్ర దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బీజేపీ బాటలో కాంగ్రెస్.. ఢిల్లీ కార్యాలయం షిఫ్ట్, పేరు కూడా మార్చేశారు

అయితే దీనిని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి దీనిపై స్పందిస్తూ.. ఈ బాధ, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, మేము మా చివరి శ్వాస వరకు పోరాడుతామని చెప్పారు. తమను ఏదీ ఆపలేదని స్పష్టం చేశారు. చరిత్రను పరిశీలిస్తే, ఇప్పటి వరకు అనేక దేశాలు ఇతర దేశ పౌరులను ఖైదీలుగా తీసుకున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. చాలా సందర్భాలలో మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే బందీలను విడిపించి సురక్షితంగా వారి దేశానికి తీసుకురాగలిగారు. సైనిక చర్యకు బదులుగా రాజీనే ఎక్కువ సందర్భాల్లో పని చేసింది. కానీ గాజా, ఇజ్రాయెల్ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.