త్వరలోనే కరోనా ఖతం, ఈ ఏడాదే అందుబాటులోకి వ్యాక్సిన్, ట్రంప్ గుడ్ న్యూస్

  • Published By: naveen ,Published On : August 28, 2020 / 12:19 PM IST
త్వరలోనే కరోనా ఖతం, ఈ ఏడాదే అందుబాటులోకి వ్యాక్సిన్, ట్రంప్ గుడ్ న్యూస్

Updated On : August 28, 2020 / 1:26 PM IST

కరోనా వ్యాక్సిన్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పారు. త్వరలోనే కరోనాను ఖతం చేస్తామన్నారు. అమెరికాలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయని.. త్వరలోనే వాటి ఉత్పత్తి ప్రారంభించి ఈ ఏడాదిలోనే సమర్థవంతమైన టీకాని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అందరం కలిసి కరోనా వైరస్‌ను తరిమికొడతామని ట్రంప్ నమ్మకంగా చెప్పారు.



ఈ ఏడాదే అందుబాటులోకి సమర్థవంతమైన వ్యాక్సిన్:
‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్’‌ కింద కరోనా వైరస్‌ కట్టడి కోసం తెలివిగల శాస్త్రవేత్తలను అమెరికా నియమించిందని ట్రంప్ తెలిపారు. ‘రికార్డు సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మేధావులైన అమెరికా శాస్త్రవేత్తలను నియమించాం. వారందరి కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసి కరోనాను ఖతం చేస్తాము’ అని ట్రంప్ అన్నారు.
https://10tv.in/nearly-50-people-in-north-texas-drank-bleach-this-month/
అధ్యక్ష పదవికి రెండోసారి నామినేట్ అయిన ట్రంప్:
నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి రెండోసారి ట్రంప్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, రెండోసారి అధ్యక్ష పదవికి నామినేట్‌ చేయడం పట్ల కృతజ్ఞత తెలిపారు ట్రంప్‌. గత నాలుగేళ్లలో సాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నానని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తుపై అనంతమైన విశ్వాసంతో ఉన్నామని ట్రంప్ చెప్పారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌పై విమర్శలు కురిపించారు ట్రంప్. బిడెన్ అమెరికాను రక్షించేవాడు కాదని, అమెరికా ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ఆరోపించారు.



అమెరికాలో 60లక్షల కరోనా కేసులు, లక్షా 84వేల మరణాలు:
కాగా, ప్రపంచంలో కరోనా దెబ్బకు అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కరోనా దెబ్బకు అమెరికా కకావికలం అయ్యింది. అమెరికాలో ఇప్పటివరకు 60లక్షల 46వేల 634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 33లక్షల 47వేల 940 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు లక్షా 84వేల 796 మంది కోవిడ్ తో మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25లక్షల 13వేల 898 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 16వేల 231 మంది పరిస్థితి విషమంగా ఉంది.

కరోనాను ఖతం చేసే టీకాల కోసం ఎదురుచూపులు:
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను ఖతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే పనిలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని నెలల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సైంటిస్టులు కృషి చేస్తున్నారు. కాగా, ఇప్పటికే స్పుత్నిక్ వీ వాక్సిన్‌ను రష్యా విడుదల చేసినప్పటికీ.. దానిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ టీకాపై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.



భారత్ లోనూ ట్రయల్ దశలో టీకాలు:
భారత్‌లోనూ పలు వ్యాక్సిన్‌లు ట్రయల్ దశలో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin), జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ (Zycov-d) వాక్సిన్‌లు రెండో దశ ట్రయల్స్ దశలో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆక్స్‌పర్డ్-ఆస్ట్రాజెనికా వాక్సిన్‌పై పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వాక్సిన్ ట్రయల్స్‌తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అంగీకారం కుదిరింది. ఒకవేళ ఆక్స్‌పర్డ్ వాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్‌లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుంది.