Benjamin Netanyahu: మూడు పెళ్లిల్లు, సైన్యంలో అన్న చనిపోయాక కసితో రాజకీయాల్లోకి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర జర్నీ తెలుసుకోండి

ఇజ్రాయెల్‌లో పరిచయమైన మిరియం వీజ్‌మన్‌తో నెతన్యాహు మొదటి వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమార్తె, ఆమె పేరు నోవా. వీజ్మాన్ గర్భవతిగా ఉన్నప్పుడు, నెతన్యాహు బ్రిటీష్ విద్యార్థి ఫ్లూర్ కేట్స్‌ను కలుసుకున్నారు, అనంతరం ఆమెతో ఎఫైర్ ప్రారంభించారు.

Benjamin Netanyahu: మూడు పెళ్లిల్లు, సైన్యంలో అన్న చనిపోయాక కసితో రాజకీయాల్లోకి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర జర్నీ తెలుసుకోండి

Benjamin Netanyahu: గత వారం, ఈ రోజు ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో అందరి చూపు ప్రధానంగా ఒక వ్యక్తిపై కేంద్రీకృతమై ఉంది. ఆయనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. యుద్ధం తర్వాత ఆయన గురించి ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. మరి బెంజమిన్ నెతన్యాహు గురించి తెలుసుకుందాం.

టెల్ అవీవ్‌లో పుట్టి, జెరూసలేంలో పెరిగారు
బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్‌లో జన్మించారు. ఆయనను ‘బీబీ’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇజ్రాయెల్ స్థాపించిన తర్వాత జన్మించిన మొదటి ప్రధానమంత్రి నెతన్యాహు. ఇజ్రాయెల్ 1948లో స్థాపించారు. తన యవ్వనంలో కొంత సమయాన్ని జెరూసలెంలో గడిపారు.

18 ఏళ్ల వయసులో సైన్యంలోకి
ముగ్గురు తోబుట్టువులలో రెండవవాడైన నెతన్యాహు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత 1967లో దేశ సైన్యంలో చేరారు. 18 ఏళ్ల వయసులో సైన్యంలో చేరిన నెతన్యాహు.. ఐదేళ్లపాటు సయెరెట్ మత్కల్ అనే ప్రమాదకరమైన ప్రత్యేక దళానికి ప్రత్యేక కమాండోగా ఉన్నారు. ఆ సమయంలో, నెతన్యాహు ఆపరేషన్ ఇన్ఫెర్నో, ఆపరేషన్ గిఫ్ట్, ఆపరేషన్ ఐసోటోప్ వంటి అనేక ప్రధాన సైనిక కార్యకలాపాలలో పాల్గొన్నారు.

ఇది కాకుండా, వార్ ఆఫ్ అట్రిషన్, యోమ్ కిప్పూర్ వంటి అనేక ప్రధాన యుద్ధాలలో ఇజ్రాయెల్ సైన్యం తరపున పాల్గొన్నారు. కిప్పూర్ యుద్ధంలో అతని ధైర్యసాహసాలకు అతను కెప్టెన్ బిరుదును అందుకున్నానే. ఆ సమయంలో, నెతన్యాహు ఆర్మీ యూనిఫాంలో కమాండోగా ఉన్న ఆకర్షణీయమైన చిత్రాలు ఇజ్రాయెల్ యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా అమ్మాయిల్లో అద్భుతమైన శరీరాకృతి కలిగిన నెతన్యాహూపై విపరీతమైన క్రేజ్ ఉండేది.

సైన్యం నుంచి బయటకు వచ్చి అమెరికాకు
1972లో సైన్యం నుంచి బయటకు వచ్చిన నెతన్యాహు.. అమెరికాకు వెళ్లి చదువుకున్నారు. నెతన్యాహు బోస్టన్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని, బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఇది కాకుండా, ఆయన MIT, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రాన్ని కూడా అభ్యసించారు.

సైనిక చర్యలో సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు
నెతన్యాహు అన్నయ్య యోనాటన్ నెతన్యాహు కూడా ఇజ్రాయెల్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిషన్ అయిన ఆపరేషన్ యాంటిబ్స్‌ను నిర్వహించిన జట్టుకు జోనాథన్ కమాండర్. ఉగాండాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి 1976 సంవత్సరంలో ఆపరేషన్ ఎంటాబి లేదా థండర్ బోల్ట్ ప్రారంభించారు. ఈ మిషన్ సమయంలో జోనాథన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణం తరువాత, ఆయన గౌరవార్థం ఈ మిషన్‌కు ఆపరేషన్ యోని అని పేరు పెట్టారు.

అన్న మరణంతో కసితో రాజకీయాల్లో
తన చదువు పూర్తి చేసిన తర్వాత, నెతన్యాహు తిరిగి వచ్చి తన సోదరుడు యోనాటన్ జ్ఞాపకార్థం ‘యోనాటన్ యాంటీ టెర్రరిస్ట్ ఇన్స్టిట్యూట్’ని సృష్టించారు. ఆయన సోదరుడి మరణం నెతన్యాహుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అప్పటి నుంచి ఉగ్రవాదంపై పోరాడాలని నెతన్యాహూ నిశ్చయించుకున్నారు.

ఆ తర్వాత రాజకీయాల వైపు మళ్లారు. లికుడ్ పార్టీ నుంచి నెస్సెట్ సభ్యుడు (MP) అయ్యారు. 1993లో నెతన్యాహు లికుడ్ పార్టీ అధినేత అయ్యారు. కేవలం మూడు సంవత్సరాల తరువాత అంటే 1996 లో ఆయనకు ఉన్న విపరీతమైన ప్రజాదరణ కారణంగా, చిన్న వయస్సులోనే దేశ ప్రధాన మంత్రి పదవికి చేరుకున్నారు. ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థి షిమోన్ పెరెస్‌పై నెతన్యాహు ఘన విజయం సాధించారు.

అయితే కేవలం మూడేళ్ల తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థి ఎహుద్ బరాక్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్ రంగం వైపు మళ్లారు. అయినప్పటికీ, ఆయన ఎక్కువ కాలం రాజకీయాలకు దూరంగా ఉండలేకపోయారు. 2002లో తిరిగి వచ్చి ప్రధాన మంత్రి ఏరియల్ షారోన్ ప్రభుత్వంలో విదేశాంగ, ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు.

2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వంలో రెండోసారి ప్రధానిగా, 2013 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో మూడోసారి ప్రధాని అయ్యారు. ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయనకు ఆదరణ తగ్గలేదు. 2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఇదే కారణం. దీంతో నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెతన్యాహు నాలుగుసార్లు ప్రధానిగా ఆ దేశ వ్యవస్థాపకుడు బెన్ గురియర్ రికార్డును సమం చేశారు.

ప్రధానమంత్రిగా నెతన్యాహు ఐదవ ఇన్నింగ్స్ మే 2020లో ప్రారంభమైంది. ఈ సమయంలో ఆయన బెన్నీ గంజ్ పార్టీ బ్లూ అండ్ వైట్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 సార్వత్రిక ఎన్నికల తర్వాత, నెతన్యాహు మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, డిసెంబర్ 2022లో ఆరోసారి ప్రధానమంత్రి అయ్యారు.

మూడు పెళ్లిళ్లు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌లో పరిచయమైన మిరియం వీజ్‌మన్‌తో నెతన్యాహు మొదటి వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమార్తె, ఆమె పేరు నోవా. వీజ్మాన్ గర్భవతిగా ఉన్నప్పుడు, నెతన్యాహు బ్రిటీష్ విద్యార్థి ఫ్లూర్ కేట్స్‌ను కలుసుకున్నారు, అనంతరం ఆమెతో ఎఫైర్ ప్రారంభించారు. ఈ వ్యవహారం వీజ్‌మన్‌కు తెలిసిన వెంటనే, ఆమె నెతన్యాహుతో విడిపోయి విడాకులు తీసుకుంది. అనంతరం 1981లో కటాసేతో నెతన్యాహు పెళ్లి అయింది. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవకపోవడంతో 1984లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

దీని తరువాత, మూడవ భార్య సారా బెన్-ఆర్ట్జీ రూపంలో నెతన్యాహు జీవితంలోకి వచ్చింది. సారా విడాకులు తీసుకున్న మహిళ. ఇద్దరూ కలిసినప్పుడు, ఆమె ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం యైర్, అవ్నర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెతన్యాహుకు అనేక భాషల్లో అవగాహన ఉంది. హీబ్రూ, ఇంగ్లీషులో అనేక పుస్తకాలు రాశారు కూడా. అవి రష్యన్, ఫ్రెంచ్, అరబిక్, జపనీస్ వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి.