MAA Elections: ఈసారి ఏకగ్రీవమే.. మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. సినిమాలు ఎప్పుడొస్తాయి.. కొత్త సినిమాలు మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి అంటూ ఇండస్ట్రీలో సినిమాల గురించి చర్చ జరగాల్సింది. కానీ, ఈసారి ఆసక్తికరంగా ఎన్నికల గురించి ఇండస్ట్రీ హాట్ గా మారింది.

MAA Elections: ఈసారి ఏకగ్రీవమే.. మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Maa Elections

Updated On : July 4, 2021 / 10:41 PM IST

MAA Elections: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. సినిమాలు ఎప్పుడొస్తాయి.. కొత్త సినిమాలు మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి అంటూ ఇండస్ట్రీలో సినిమాల గురించి చర్చ జరగాల్సింది. కానీ, ఈసారి ఆసక్తికరంగా ఎన్నికల గురించి ఇండస్ట్రీ హాట్ గా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అవుతారని ఇండస్ట్రీ వర్గాలే కాదు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూసేలా మారిపోయింది.

ఈసారి ఒకరికి ఐదుగురు పోటీకి దిగేందుకు ఆసక్తి చూపడం.. ఇప్పటికే ఎవరికి వారి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి స్టేట్మెంట్లు కూడా ఇచ్చేయడంతో ఇప్పుడు మా ఎన్నికలు కాస్త రాజకీయ వేడి రగిల్చాయి. ఒకవిధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు మించి గ్రూపులుగా మారి రాజకీయం నడిపిస్తున్నారా అనేలా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు ఎవరవుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇదిలా ఉండగానే నటుడు, నిర్మాత, మాజీ ‘మా’ అధ్యక్షుడు.. ‘మా’లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలు ఏకగ్రీవమే అవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం ‘మా’లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ కలిసి ఒకనిర్ణయానికి రావడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం గాడి తప్పిన ‘మా’ను మళ్లీ పట్టాలెక్కించడానికి చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి వాళ్ళతో కలిసి తాము ప్రయత్నిస్తున్నట్లు మురళీ మోహన్ చెప్పారు. అందర్నీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొనేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మురళీ మోహన్ వ్యాఖ్యలతో ‘మా’లో ఏం జరగబోతుందా అనే ఆసక్తి మొదలైంది.