పెళ్లి మరణాలకు కారణమైంది.. కుటుంబంలో నలుగురు కరోనాతో చనిపోయారు

After Marriege Ceremony Four Family Members Lost Their Lives Due To Corona
కరోనా వైరస్ కేసులు ప్రతీరోజూ పెరిగిపోతూ ఉండగా.. వ్యాప్తికి కారణం వేడుకలు కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక అదే కుటుంబంలో నలుగురు చనిపోవడానికి కారణం అయ్యింది. బీహార్‌లో లాక్‌డౌన్ అమలులో ఉండగా.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వివాహ వేడుకలను వాయిదా వేయాలని ప్రజలను కోరుతున్నారు.
అయినప్పటికీ, ప్రజలు పెళ్లిళ్లు పోస్ట్ పోన్ చేయడానికి సిద్ధంగా లేరు. పెళ్లిని వాయిదా వేయడం కష్టమంటూ.. కరోనా యుగంలో వివాహ వేడుకను నిర్వహించిన ఒక కుటుంబానికి పెళ్లే శాపంగా మారింది. కరోనా కుటుంబంపై పగబట్టినట్లుగా.. నలుగురు మృతికి కారణం అయ్యింది. ఆ కుటుంబంలో ఇప్పటివరకు నలుగురు కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు.
దర్భంగా నగరంలోని మీర్జాపూర్ నివాసి అయిన విపిన్ బిహారీ చౌదరి చిన్న కుమార్తె ఏప్రిల్ 16న మీర్జాపూర్లో వివాహం చేసుకుంది. వివాహ వేడుకలో పాల్గొనడానికి బంధువులు చాలా దూరం నుండి వచ్చారు. వివాహ వేడుక అనంతరం.. 20 నుండి 25 రోజుల్లో, వివాహ వేడుకలో పాల్గొన్న నలుగురు బంధువులు కరోనా కారణంగా చనిపోయారు.
వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత, విపిన్ విహారీ చౌదరి మేనల్లుడు కరోనాతో చనిపోగా.. 10 రోజుల తరువాత, రవిశంకర్ చౌదరి కరోనాతో మరణించాడు. అలాగే, పంచోబ్ నివాసి విపిన్ బిహారీ చౌదరి బావ కూడా కరోనాతో మరణించారు. అదే సమయంలో, ఈ వేడుకలో పాల్గొన్న నాల్గవ వ్యక్తి సంపూర్ణానంద్ చౌదరి కూడా చనిపోయారు. కరోనా సంక్రమణ కారణంగా ఇప్పటివరకు నలుగురు కుటుంబ సభ్యులు మరణించినట్లు విపిన్ బిహారీ చౌదరి చెప్పుకొచ్చారు.
మనవడు, మేనల్లుడు, బావ మరియు కుటుంబంలో బంధువుతో సహా మొత్తం కుటుంబం కరోనాతో మరణించిందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వేడుకలను వాయిదా వేసుకుంటేనే మంచిదని, ఏదైనా ఇబ్బంది పెళ్లి కారణంగా జరిగితే.. జీవితాంతం బాధను అనుభవించవలసి వస్తుందని చౌదరి అన్నారు.