ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ హోదా.. రూపాయే జీతం!

ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ హోదా.. రూపాయే జీతం!

Updated On : March 2, 2021 / 9:42 AM IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రశాంత్ రాజకీయ సలహాదారుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్‌కు సమానమైన హోదాను పంజాబ్ ప్రభుత్వంలో ప్రశాంత్ కిశోర్‌‌కు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అప్పగించారు. రాజకీయ సలహాదారుగా పీకేను నియమించుకుని, ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ హోదా దక్కనుంది. ప్రశాంత్‌ కిశోర్‌ నియామకాన్ని సీఎం కార్యాలయం కూడా ధృవీకరించింది. ప్రశాంత్ కిశోర్ గౌరవ వేతనం కేవలం ఒక్క రూపాయి మాత్రమేనని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

పంజాబ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. అమరీందర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా అఖండ విజయం సాధించిపెట్టారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌పై నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీతో అకాళీదళ్‌ తెగతెంపులు, రైతుల ఆందోళన గెలుపుకు బాటలు వేస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ఏడు మున్సిపల్ కార్పేరేషన్లను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అకాళీదళ్, బీజేపీ, ఆప్‌లను ప్రజలు తిరస్కరించారు.

ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ‌ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ విజయం కోసం పనిచేస్తున్నారు. బెంగాల్‌ పుత్రిక మమతకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, బీజేపీకి రెండంకెల స్థాయిలో కూడా సీట్లు రావన్నారు ప్రశాంత్ కిశోర్. తమిళనాడులో కూడా డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌తో కలిసి పనిచేస్తున్నారు. బీహార్‌లో నితీష్‌ పార్టీ జేడీయూకు కొన్నిరోజులు నెంబర్‌ 2గా వ్యవహరించారు.