Lingusamy : గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ లింగుస్వామి..

డైరెక్టర్ లింగు స్వామి ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు.. తమిళనాడులోని మనపాక్కం ఆశ్రమంలో కరోనా రోగుల కోసం 50 బెడ్స్ అందించారు..

Lingusamy : గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ లింగుస్వామి..

Lingusamy

Lingusamy: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి రెండు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని స్టార్‌ దర్శకుల్లో ఎన్‌. లింగుస్వామి ఒకరు. ప్రముఖ దిగ్గజ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తన సొంత నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఆనందం’ చిత్రం ద్వారా లింగుస్వామి కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఈ మూవీలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, మురళి, అబ్బాస్‌, దేవయాని, రంభ తదితరులు నటించారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. పైగా తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డును సొంతం చేసుకుంది. పూర్తిగా ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్‌. లింగుస్వామి డైరెక్టరుగా 20 యేళ్ళు పూర్తి చేసుకున్నారు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత ఆర్‌.బి.చౌదరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా.. కరోనా వైరస్‌ మహమ్మారి కష్టకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఇలాంటి సమయంలో తాను 20 యేళ్ళ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు లింగుస్వామి తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.

అదేసమయంలో దేశ ప్రజలంతా ఈ మహమ్మారి నుంచి బయటపడినపుడే నిజమైన ఆనందం అని, ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే సురక్షితంగా వుండాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, లింగుస్వామి ‘ఆనందం’ చిత్రం తర్వాత ‘రన్‌’, ‘జి’, ‘సండైకోళి (పందెంకోడి)’, ‘భీమ’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హీరో సూర్యతో ‘ఆంజాన్‌’ తెరకెక్కించారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ రామ్‌ పొతినేనితో ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం డైరెక్టర్ లింగు స్వామి ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని మనపాక్కం ఆశ్రమంలో కరోనా రోగుల కోసం 50 బెడ్స్ అందించారు. సిపాక సహకారంతో డైరెక్టర్ లింగుస్వామి ఏర్పాటు చేసిన ఈ బెడ్స్‌ను నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, మంత్రి అన్బరసన్, ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్ ప్రారంభించారు..