అమెరికాలో Pfizer-BioNTech వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

Pfizer’s Covid Vaccine : ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికాలో లైన్ క్లియర్ అయ్యింది. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్- FDA ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రాగానే వ్యాక్సినేషన్‌ను మొదలుపెడతారు. కొన్ని గంటల్లోనే అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు. అమెరికా FDA గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మొదటి వ్యాక్సిన్ ఫైజరే… ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా విస్తృత వినియోగానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే పచ్చజెండా ఊపింది.
16 ఏళ్లు పైబడిన వారికి :-
అన్ని అనుమతులు రాగానే 16 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. సుమారు 3కోట్ల డోసులను 24గంటల్లోనే ప్రజలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫెడరల్ అధికారులు చెబుతున్నారు. ముందుగా హెల్త్‌కేర్ వర్కర్లతో దీన్ని మొదలుపెడతారు. మిగిలిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కూడా 3,4రోజుల్లోనే వ్యాక్సిన్ అందిస్తారు. వచ్చే వారాంతానికి ఇది పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే సామాన్య జనానికి వ్యాక్సిన్ ఇస్తారు. ఫైజర్ వ్యాక్సిన్ 95శాతం సమర్ధతతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. చైనా కరోనా వైరస్ జెనెటిక్ బ్లూప్రింట్‌ను అందచేసిన 336 రోజుల్లోనే ఫైజర్ వ్యాక్సిన్ రెడీ అయ్యింది. గతంలో 5 దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపాయి. అమెరికా ఆరోదేశంగా నిలిచింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి కూడా ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా దీనికి క్లియరెన్స్ రావాల్సి ఉంది.
FDA గ్రీన్ సిగ్నల్ :-
FDA గ్రీన్‌సిగ్నల్ రావడానికి ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. సంస్థ తీరుపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం రాత్రిలోపు అత్యవసర వినియోగానికి కనుక ఆమెదం తెలపకపోతే FDA కమిషనర్ స్టీఫెన్ హాన్ రాజీనామా చేయాల్సి ఉంటుందని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమోదం లభించింది. వ్యాక్సిన్‌ను త్వరగా తేవాలని ట్రంప్ భావిస్తున్నప్పటికీ… FDA మాత్రం నిబంధనల ప్రకారమే వెళ్లాలని భావించింది. వ్యాక్సిన్ సమర్ధతపై క్లారిటీ వచ్చాకే ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇది ట్రంప్ అధికార యంత్రాంగానికి నచ్చలేదు. అమెరికాలో కోటీ 63లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 3లక్షల మందికి పైగా దీనికి బలైపోయారు. రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. శుక్రవారం అమెరికాలో 2లక్షల 46వేల కేసులు వచ్చాయి.