కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే

రెమ్‌డెసివిర్(Remdesivir).. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి ప్రభావవంతంగా

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 04:24 AM IST
కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే

Updated On : June 14, 2020 / 4:24 AM IST

రెమ్‌డెసివిర్(Remdesivir).. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి ప్రభావవంతంగా

రెమ్‌డెసివిర్(Remdesivir).. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌డెసివిర్. కరోనా చికిత్సకు పలు దేశాలు ఈ యాంటీ వైరల్ డ్రగ్ నే వినియోగిస్తున్నాయి. కరోనా వైరస్‌ చికిత్సలో ఇది ఎంతో ప్రభావితంగా పనిచేస్తుందని నమ్ముతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో కరోనా రోగులకు ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాన్ని ఇవ్వొచ్చని చెప్పింది. ఈ మేరకు సిఫార్సు చేసింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అని స్పష్టం చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రెమ్‌డెసివిర్:
కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్స్‌ ఫర్‌ కోవిడ్‌–19’ను శనివారం(జూన్ 13,2020) విడుదల చేసింది. యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే కరోనా ప్రాథమిక దశలోనే ఉంటే యాంటీ మలేరియల్‌ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌(hydroxychloroquine) మాత్రలు వాడుకోవచ్చని తెలిపింది. కాగా, తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ మాత్రలు వాడకపోవడమే మంచిదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన ప్రోటోకాల్‌లోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ తొలగించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్‌ ఇవ్వొచ్చని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. భారత్‌తో సహా 127 దేశాల్లో కోవిడ్‌-19 చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించే వీలుంది. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ తయారీకి హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ హెటెరో గ్రూప్‌ గిలీడ్‌ నుంచి లైసెన్స్‌ పొందింది. కాగా సింజెన్‌, జైడస్‌ క్యాడిలా కూడా గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రెమ్‌డెసివిర్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం:
యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి విక్రయించడానికి గిలీడ్‌ సైన్సెస్ తో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్‌-19 చికిత్సకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి తాత్కాలిక అత్యవసర అనుమతి ఇచ్చింది. కొవిడ్‌-19 చికిత్సలో రెమ్‌డెసివిర్‌ పనితీరును ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. సానుకూల ఫలితాలు కనిపించడంతో ఎఫ్‌డీఏ ఈ మేరకు అనుమతి ఇచ్చింది.

వాసన, రుచి శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలే:
దగ్గు, జ్వరం, అలసట, డయేరియా, గొంతు నొప్పి, శ్వాస పీల్చడంలో ఇబ్బందులతోపాటు వాసన, రుచిని గ్రహించే శక్తిని కోల్పోవడం కూడా కరోనా వైరస్‌ లక్షణాలేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. సవరించిన క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌లో ఈ అంశాన్ని చేర్చింది. చాలామంది రోగుల్లో ఈ లక్షణాలు కనిపించటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా కనిపిస్తుండటంతో వైద్య ప్రమాణాలను సవరించింది. కొవిడ్‌-19 రోగులకు అందించే వైద్య విధానాల్లో మార్పులు చేస్తూ నూతన మార్గదర్శకాలను జారీచేసింది.

వైరస్ సోకిన వారిలో 13 రకాల లక్షణాలు:
* జ్వరం
* దగ్గు
* అలసట
* ఊపిరి ఆడకపోవటం
* ముక్కుకారటం
* డయేరియా
* గొంతు పొడిబారటం వంటి లక్షణాలు ఉంటే కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు అనుమానించాలని ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేసింది. వాటితోపాటు ఇటీవల అనేకమంది కరోనా రోగులు తమకు ఉన్నట్టుండి వాసన(smell), రుచి(taste) చూసే సామర్థ్యం తగ్గిపోయాయని వెల్లడించటంతో కేంద్ర ఆరోగ్యశాఖ వాటిని కూడా కరోనా లక్షణాలుగా పరిగణించాలని వైద్యులకు సూచించింది.

వైరస్‌ సోకినవారిలో 13 రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మే లో ప్రకటించింది. అందులో 
* జ్వరం
* పొడిదగ్గు
* శ్వాస సమస్య
* పొడిగొంతు
* అలసట
* జలుబు
* డయేరియాతోపాటు దగ్గినప్పుడు రక్తం పడటం, ఒంటినొప్పులు, ఛాతీ నొప్పి, ముక్కు నుంచి నీరుకారటం, కఫం, పొత్తకడుపులో నొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉన్నాయి. వృద్ధులు, రోగ నిరోధకశక్తి తగ్గిన వ్యక్తుల్లో జ్వరం లేకపోయినా అలసటతో పాటు ఉత్సాహం, కదలికలు తగ్గడం, అతిసారం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. అయితే, పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో జ్వరం, దగ్గు ఉండటంలేదని తెలిపింది.