Kevin O’Brien Retirement : స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని సంచలన నిర్ణయం

ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 16ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్.

Kevin O’Brien Retirement : స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని సంచలన నిర్ణయం

Updated On : August 16, 2022 / 4:53 PM IST

Kevin O’Brien Retirement : ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 16ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్. టీ20 వరల్డ్ కప్ తర్వాత వైదొలగాలని భావించినా.. ప్రస్తుత సిరీస్ లకు సెలెక్టర్లు తనను పక్కన పెట్టడం బాధించిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెవిన్ వివరించాడు. కెవిన్ 153 వన్డేలు, 110 టీ20ల్లో 5వేల 592 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.

2006 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన కెవిన్ ఓబ్రైన్.. ఐర్లాండ్ తరుపున 3 టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో మూడు సెంచరీలను నమోదు చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్‌పై కెవిన్ చేసిన సంచలన సెంచరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ అతను టీమ్‌కి విజయాలను అందించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 172 వికెట్లు పడగొట్టిన ఓబ్రైన్ వన్డే, టీ20ల్లో ఉపయుక్తమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. కెవిన్ ఒబ్రెయిన్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పై ఆడిన ఇన్నింగ్స్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐసీసీ.

 

వరల్డ్ కప్ లో కెవిన్ సంచలన బ్యాటింగ్..

2011 వన్డే వరల్డ్ కప్‌ పటిష్ట ఇంగ్లండ్ టీమ్‌ని ఓడించి, ఊహించని షాక్ ఇచ్చింది ఐర్లాండ్. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన ఐర్లాండ్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలదని ఎవ్వరూ ఊహించలేదు. ఇంగ్లండ్ ఈజీగా భారీ విజయం అందుకుంటుందని అంచనా వేశారు.

అనుకున్నట్టే ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది ఐర్లాండ్. వరుస వికెట్లు కోల్పోయి 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఐర్లాండ్‌ని కెవిన్ తన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేసిన కెవిన్ ఓ’బ్రియన్.. రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ఆ తర్వాత అలెక్స్ కుసక్, జాన్ మూవీ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేయడంతో 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసిన ఐర్లాండ్.. చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

అంతకుముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసిన ఐర్లాండ్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు కెవిన్. పాకిస్తాన్‌తో 2018లో తొలి టెస్టు ఆడిన కెవిన్ ఓ’బ్రియన్, తన అరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి.. మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఏకైక ఐర్లాండ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.