Jogging : బాడీ ఫిట్ కోసం జాగింగ్….
కాంక్రీటు రహదారులపైన కాకుండా నేలపైనే జాగింగ్ చేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల కాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

Jogging
Jogging : జాగింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరం ఫిట్ గా తయారయ్యేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే జాగింగ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాగింగ్ చేసేవారు బిగుతుగా ఉన్న దుస్తులు కాకుండా వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించాలి. కాళ్లకు షూలను వాడటం మంచిది. షూసరిగా లేకుంటే పరిగెత్తటం కొంచెం అసౌకర్యాంగా ఉంటుంది.
జాగింగ్ చేయటానికి ముందుగా కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది. వీటిని వార్మప్ ఎక్సర్ సైజులు అంటారు. ముందునడవటంతో ప్రారంభించి కొద్ది కొద్దిగా పరెగెత్తుతూ వేగం పెంచాలి. ఇలా చేయటం వల్ల జాగింగ్ సవ్యంగా సాగుతుంది. త్వరగా అలసటకు గురికాకుండా ఉంటారు. సరైన పద్దతిలో జాగింగ్ చేయక పోవటం వల్ల కొన్ని పర్యాయాలు వెన్నుసమస్యలు ఉత్పన్నమౌతాయి.
ముఖ్యంగా కాంక్రీటు రహదారులపైన కాకుండా నేలపైనే జాగింగ్ చేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల కాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. జాగింగ్ కు వెళ్ళేముందు నీటిని తాగాలి. ప్రతిరోజు 40 నిమిషాల జాగింగ్ వల్ల శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. జాగింగ్ వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. జాగింగ్ వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్ధ్యం మెరుగవుతుంది.
శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా సాగేందుకు, గుండె ఆరోగ్యానికి జాగింగ్ వల్ల ఎంతో మేలు కలుగుతుంది. మానసిక వత్తిళ్ళు దూరమైపోతాయి. జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుండి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. జాగింగ్ వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.