Hero Nani: హీరో నానీకి థియేటర్ ఓనర్స్ క్షమాపణలు
నేచురల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ చెయ్యడంపై థియేటర్ల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nani
Hero Nani: నేచురల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ చెయ్యడంపై థియేటర్ల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ ఓనర్స్ అసంతృప్తికి కారణం నానీ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “టక్ జగదీష్”.. థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న విడుదల కానుండడమే. నానీ లాంటి స్టార్ హీరో సినిమాని, భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానీని ఈ విషయంలో తప్పుబట్టారు. శుక్రవారం జరిగిన తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం హీరో నానిపై విమర్శలు గుప్పించారు.
ఈ సంధర్భంగా.. నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని, నిజ జీవితంలో పిరికివాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో హీరో నానితోపాటు.. చిత్రయూనిట్ పై విమర్శలు చేస్తున్న థియేటర్ ఓనర్స్ పై ఇండస్ట్రీ నుంచి ఎదురుదాడి మొదలైంది. దీంతో ఎట్టకేలకు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానీకి, టక్ జగదీష్ చిత్రయూనిట్‌కి క్షమాపణలు చెబుతూ లేఖను విడుదల చేసింది.
ఎవరైనా ఎగ్జిబిటర్లు వ్యక్తిగతంగా ఘాటుగా విమర్శించి వుంటే క్షమించాలి అంటూ అపాలజీ లెటర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి వారి మీటింగ్‌లో ఇద్దరు ఎగ్జిబిటర్లు నానిపై విమర్శలు చేశారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ, నిర్మాత సునీల్ నారంగ్ కూడా ఈమేరకు మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నానిని నిందించడం తగదని, కొందరు ఎగ్జిబిటర్లు తమ ట్రేడ్ దెబ్బతింటుంది ఏమో అనే భయంతో వ్యక్తిగత విమర్శలు చేసినట్లుగా చెప్పారు. అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు లేఖలో వెల్లడించారు.