TRS VS BJP : మోడీ ఫోటో రేషన్ షాపుల వద్ద కాదు .. పెరిగిన నిత్యావసరాలపై పెట్టాలి : కవిత
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాని మోడీ ఫోటోపై రచ్చ కొనసాగుతోంది. TRS, BJP నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగేలా చేస్తోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..మోడీ ఫోటో రేషన్ షాపుల వద్ద కాదు .. పెరిగిన నిత్యావసరాలపై పెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు.

TRS MLC's Kavitha satires on PM Modi's photo
TRS VS BJP In Telangana : తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాని మోడీ ఫోటోపై రచ్చ కొనసాగుతోంది. పేదల కడుపు నింపటానికి కేంద్రం రేషన్ బియ్యం ఇస్తోందని కాబట్టి రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని తెలంగాణ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ..టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగేలా చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో పెట్టే సంప్రదాయం ఎప్పుడన్నా ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఫోటో పెట్టాల్సిందే..కానీ రేషన్ షాపుల వద్ద కాదు..పెరిగిన నిత్యావసరాల వస్తువులపై మోడీ ఫోటో పెట్టాలి అని అన్నారు కవిత. పేదలకు అందించే పథకాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కవిత ఈ సందర్భంగా ఆరోపించారు. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించిన కవిత పేదలకు ఉచితాలు ఇస్తుంటే అది తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యతానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలా ఈటల నియోజకవర్గం అయిన హుజూరాబాద్ కు ఉప ఎన్నికవచ్చింది. ఈ ఉప ఎన్నికలో మరోసారి హుజూరాబాద్ లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల. అలా..హుజురాబాద్ ఉపఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగిన పొలిటికల్ వార్ ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. దీనికి తోడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడుకు కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. కానీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అన్ని పార్టీల మధ్యా కాకరేపుతోంది.
ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మునుగోడు బైపోల్‌లో గెలుపుపై గురి పెట్టిన కమలం నేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే పర్యటనలో ఫోటోల అంశాన్ని తెరపైకి తేవడంతో టీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగినట్లుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం కౌంటర్స్‌ని తిప్పి కొడుతున్నారు.
రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటోపై రచ్చ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్ఎస్‌కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపుతోందని తెలంగాణ నుంచి ట్యాక్స్ ల రూపంలో కేంద్రానికి పోయేది ఎక్కువ..కేంద్రం నుంచి తెలంగాణకు నిధుల రూపంలో వచ్చేది నామ మాత్రమేనని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వమే కేంద్రాన్ని నడిపిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణాకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్ధికసాయం, విభజన హమీలు, పెట్టుబడులు రాకుండా చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటు బీజేపీ కూడా కేంద్రం తెలంగాణకు చేస్తున్న సాయాన్ని కేసీఆర్ దాచి పెట్టి తమపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శిస్తోంది. ఈ వార్ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న క్రమంలోనే బీజేపీ అగ్రస్థాయి నేతలు, కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటించడంతో గులాబీ నేతలు, కాషాయం దళం మధ్య ఉప్పు-నిప్పులా తయారైంది పరిస్థితి.
తెలంగాణలో కేంద్రమంత్రుల పర్యటనలోనూ ఇదే చర్చ..
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం (సెప్టెంబర్ 3,2022) మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వ్యాక్సినేషన్ సెంటర్‌ని విజిట్ చేసి కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడాన్ని మహేంద్రనాధథ్ పాండే తప్పుపట్టారు.వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్ లో కేసీఆర్, హరీష్ రావు ఫోటోలు మాత్రమే ఉండటం..ప్రధాని మోడీ ఫోటో లేకపోవటం ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫోటో పెడుతుంటే తెలంగాణలో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.
ఈ ఘటనకు ముందు కామారెడ్డి జిల్లా పర్యటనలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం రేషన్ షాపులో మోడీ ఫోటో లేదేంటని డీలర్‌ని నిలదీశారు. కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కేంద్రం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అని కలెక్టర్ ను ప్రశ్నించారు. దానికి కలెక్టర్ సమాధానం చెప్పలేక తెలియదని చెప్పారు. దీంతో మంత్రి నిర్మలమ్మ ఈ చిన్నపాటి విషయం కూడా తెలియదా? కలెక్టర్ గారూ..మీరు ఐఏఎస్ కదా..ఓకే..అరగంట టైమ్ ఇస్తున్నా తెలుసుకుని చెప్పండి అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు రేషన్ షాపు వద్ద ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. బీజేపీ నేతలు ప్రధాని మోడీ ఫోటో పెడతారు..దాన్ని ఎవ్వరు తొలగించకుండా చూసే బాధ్యత మీదే అంటూ దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. మంత్రి నిర్మల చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ నేతకు కౌంటర్ ఇస్తున్న బీజేపీ నేతలు..
ప్రధాని మోడీ ఫోటోలు రేషన్ షాపుల దగ్గర పెట్టకపోవడాన్ని బీజేపీ నేతలు సమర్ధించుకుంటూనే టీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఈ ట్వీట్‌లో సెటైర్ వేశారు. ప్రతి రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు.. ఎందుకంటే ప్రధాని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. కానీ..తెలంగాణలో మాత్రం ప్రతి వైన్ షాపులో కేసీఆర్ ఫోటో పెట్టాలి.. మందు బాటిళ్ల పైన పింక్ లేబుల్ వేయాలి అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలో కూడా ప్రతి వైన్ షాపులో లిక్కర్ క్వీన్ కవిత ఫోటో పెట్టాలి అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రతి రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టిన పెట్టకపోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రధాని తెలంగాణ ప్రజా గుండెల్లో ఉన్నారు.
తెలంగాణలో మాత్రం ప్రతి వైన్ షాపులో కెసిఆర్ ఫోటో పెట్టాలి & మందు బాటిళ్లు పైన పింక్ లేబుల్ వెయ్యాలి.
ఢిల్లీలో కూడా ప్రతి వైన్ షాపులో #LiquorQueen కవిత ఫోటో పెట్టాలి !
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 3, 2022