Vakeel Saab: వకీల్ సాబ్ దర్శకుడి సీక్వెల్ ప్రయత్నాలు.. ఫలించేనా?

వకీల్ సాబ్ సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు. కరోనా మొదటి దశ నుండి కోలుకున్న తెలుగు ప్రేక్షకులకు దొరికిన తొలి అతిపెద్ద సినిమా ఇదే కాగా.. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సైతం మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా కూడా ఇదే.

Vakeel Saab: వకీల్ సాబ్ దర్శకుడి సీక్వెల్ ప్రయత్నాలు.. ఫలించేనా?

Vakil Saab Directors Sequel Attempts Will It Work

Updated On : May 8, 2021 / 6:06 PM IST

Vakeel Saab: వకీల్ సాబ్ సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు. కరోనా మొదటి దశ నుండి కోలుకున్న తెలుగు ప్రేక్షకులకు దొరికిన తొలి అతిపెద్ద సినిమా ఇదే కాగా.. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సైతం మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా కూడా ఇదే. అసలే బాలీవుడ్ లో హిట్ సబ్జెక్ట్ కావడం.. దానికి దర్శకుడు వేణు శ్రీరామ్ మరికాస్త పవన్ మ్యాజిక్ జతచేసి ప్రేక్షకుల ముందుకు తేవడంతో ఈ సినిమా కరోనా రెండో దశ వ్యాప్తిలో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. అయితే, కరోనా మహమ్మారి దెబ్బకి థియేటర్లలో గట్టిగా నెల రోజులు కూడా నడిచే పరిస్థితి లేకపోవడంతో వసూళ్లలో వకీల్ సాబ్ నిలబడలేకపోయింది.

పరిస్థితి సాధారణంగా ఉండిఉంటే ఈ సినిమా ఇంకా సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉండేదని సినీ విశ్లేషకులు చెప్పిన మాట. ఇప్పుడు ఓటీటీలో వకీల్ సాబ్ దుమ్మురేపుతున్నాడు. కాగా, ఈ సినిమా ఫలితంలో పవన్ అభిమానులు దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఒక సామజిక అంశానికి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, రాజకీయ భావజాలాన్ని కలగలిపేలా సినిమాలో మాటలు, సన్నివేశాలలో మార్పులను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అందుకే దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని పట్టుబడుతున్నారు.

వకీల్ సాబ్ సీక్వెల్ రావాలని సోషల్ మీడియాతో అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. మరో కొత్త సామాజిక అంశాన్ని బేస్ చేసుకుని ఈ సీక్వెన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే మరో మంచి కథతో పవన్ వద్దకు వెళ్తానని దర్శకుడు వేణు శ్రీరామ్ ధీమాగా ఉన్నాడట. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరో ఏడాది వరకు దొరికే పరిస్థితి లేదు. అయ్యప్పనుమ్ కోషియుమ్, హరి హర వీరమల్లుతో పాటు హరీష్ శంకర్ తో మరో సినిమాకు ఒకే చెప్పాడు. ఈ సినిమాలు పూర్తయితే కానీ మరో సినిమాకు ఆస్కారం లేదు. మరి అప్పటికి వేణు శ్రీరామ్ మరో కొత్త కథతో పవన్ ను మెప్పిస్తాడా అన్నది చూడాల్సి ఉంది.