Radiation : సెల్ టవర్ల రేడియేషన్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

5జీతో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత, పిల్లలు వాటికి మరింత అతుక్కు పోతున్నారు.

Radiation : సెల్ టవర్ల రేడియేషన్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

Cell Tower

Radiation : సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ ప్రాణాలకు ప్రమాదమని ఈ మధ్య కాలంలో అనేక మంది నోటి నుండి వినిపిస్తున్న మాటలు. సెల్‌ఫోన్లు జనం చేతుల్లోకి వచ్చినప్పటి నుంచే కొన్ని భయాలు రాజ్యమేలుతున్న మాట నిజం. ఈ నేపధ్యంలో సెల్‌ టవర్లతో ప్రమాదం ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి, మొబైల్స్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ గత దశాబ్ద కాలంగా సాగుతుంది. నేటికి దీనిపై స్పష్టత లేకుండా పోయింది. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ల వల్ల పిచ్చుకలు కనుమరుగయ్యాయని, పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయని, ఆ రేడియేషన్ మనుషులకు కూడా హాని కలిగిస్తుందని ఇప్పటి వరకూ చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని, క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా ఉంది.

విద్యుదయస్కాంతక్షేత్ర సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో మొబైల్‌ టవర్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలింది. సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేష‌న్ కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ఆ స్థాయిలో లేదన్నది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే, ఫోన్‌ రేడియేషన్‌ ఉంటున్నదని వారి వాదన. ఈ వివాదం తేలనంత వరకూ, వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు.

స్పీకర్ ఫోన్‌లో మాట్లాడటం, ఫోన్‌ నిరంతరం జేబులో కాకుండా పక్కన ఉంచుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టడం లాంటి జాగ్రత్తలు పాటించమని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కలు, పక్షుల మీద సెల్‌ఫోన్‌ టవర్ల రేడియేషన్‌ ప్రభావం ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్‌టవర్లు అయోమయానికి గురి చేస్తాయనీ, వీటి నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ వాటి గుడ్లను నాశనం చేస్తాయనీ వారంటున్నారు. ఈ విషయాల గురించి కూడా కచ్చితమైన సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరం.

5జీతో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత, పిల్లలు వాటికి మరింత అతుక్కు పోతున్నారు. 5జీ వేగంతో వచ్చే ఫోన్లు వారిని ఇంకా కట్టి పడేసే ప్రమాదం లేకపోలేదు. ఇదిలావుంటే పలు దేశాల్లో 5జీ సేవలతోపాటే కరోనా విజృంభించడం యాదృచ్ఛికం. ఈనేపధ్యంలో ఈ రెండింటి మధ్యా ఏదో సంబంధం ఉందనే అపోహ మొదలైంది.

వైర్‌లెస్‌ సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత ఆధునికమైనది. 5జీ నెట్‌వర్క్‌ సాంకేతికత. 4జీ, 3జీలకన్నా ఎంతో వేగంగా, సమర్థంగా సందేశాలు, సమాచారాలను పంపడానికి 5జీలో అధిక శక్తిమంతమైన విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీలను వాడతారు. వీటి సాయంతో 4జీ కన్నా 5జీలో అత్యంత వేగంతో విస్తృత సమాచారం చేరవేయవచ్చు.5జీ కోసం నిర్మితమయ్యే శక్తిమంతమైన టవర్లు, మన రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తున్నాయని, దాంతో కరోనా వైరస్‌ త్వరగా దాడి చేసే ప్రమాదం ఉందనే అపనమ్మకం బయల్దేరింది. స్వీడన్ నుంచి ఇటలీ వరకూ అనేక ధనిక దేశాల్లోనూ ఈ భావన కనిపించడం విచిత్రం.

అమెరికా జాతీయ టాక్సికాలజీ పరిశోధన కార్యక్రమం కింద రెండేళ్లపాటు ఎలుకల మీద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ప్రభావాన్ని పరిశీలించారు. చివరకు మగ ఎలుకల్లో క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించినా, ఆడ ఎలుకల్లో అది కనిపించలేదు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే, జంతువులపై ప్రయోగాల్లో ఉపయోగించే రేడియేషన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.ఏదిఏమైనా, మొబైల్‌, డిజిటల్‌ నెట్‌వర్కుల వల్ల దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి.