Elon Musk : పిల్లల్ని వెంటనే కనండి.. పెంపకం ఖర్చుపై ఆందోళన వద్దు : ఎలన్ మస్క్

Elon Musk : ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ప్రజలు ఆందోళన చెందడం మానేసి.. వెంటనే పిల్లలను కనండి అంటూ ఎలన్ మస్క్ సూచించారు.

Elon Musk : పిల్లల్ని వెంటనే కనండి.. పెంపకం ఖర్చుపై ఆందోళన వద్దు : ఎలన్ మస్క్

Elon Musk says people should worry less about the cost of having children

Updated On : October 23, 2024 / 12:29 AM IST

Elon Musk : ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని కనేందుకు చాలామంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆర్థికపరమైన కారణాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పాత రోజుల్లో పిల్లల్ని ఎక్కువ మందిని కనేవారు. కానీ, ప్రస్తుత ఆధునిక జీవితంలో పిల్లలపై దృష్టిపెట్టడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

కొంతమంది ఆర్థిక స్థోమత కారణంగా పిల్లల్ని పోషించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. జనాభా నియంత్రణ కారణంగా రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ ధోరణి మానేసి సంతోషంగా పిల్లల్ని కనడంపై దృష్టిపెట్టాలని మస్క్ సూచించారు. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన ట్రంప్ అనుకూల ర్యాలీలో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన్ను పిల్లలను కనడం గురించి యువ తరానికి ఏమి సలహా ఇస్తారని అడిగారు. దానికి మస్క్ ’పిల్లల్ని కనండి.. కుటుంబాన్ని పెంచుకోండి‘ అంటూ సమాధానమిచ్చారు. పిల్లల విషయానికి వస్తే.. డబ్బు గురించి మరచిపోండి.. త్వరగా పెళ్లి చేసుకోండి.. ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. తన సలహాను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు.

“ప్రజలు పిల్లలను కనడం గురించి చాలా ఆందోళన చెందుతారని నేను అనుకుంటున్నాను. కొన్ని సమయాల్లో అవసరాలను తీర్చడం కష్టంగా ఉంటుంది” అని మస్క్ అభిప్రాయపడ్డారు. మస్క్ మామకు ఇప్పటికే 11 మంది పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. తన మాదిరిగానే అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రజలను సంవత్సరాల తరబడి ప్రోత్సహిస్తున్నారు. అలా చేయకపోతే ప్రపంచ జనాభా పతనం అవుతుందని కూడా మస్క్ హెచ్చరిస్తున్నారు.

“ప్రపంచంలో ఎక్కువ మందిని తల్లిదండ్రులు కావాలని ప్రోత్సహించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఆదర్శంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలి. తద్వారా జనాభా పెరుగుతుంది” అని గతంలో మస్క్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పిల్లలంటే ఖర్చు కాదని, ప్రజల జీవన విధానాలుగా పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది కాబోయే తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిపై పిల్లల పెంపకంతో కలిగే ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారని అనేక సర్వేలు సూచించాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలలో 50 ఏళ్లలోపు పిల్లలు లేని అమెరికాలో పెద్దల వాటా 2018లో 37శాతం నుంచి 2023లో 47శాతానికి పెరిగింది. ఆ గ్రూపులో 2023 ప్రతివాదులలో 36శాతం మంది తమకు పిల్లలను కనే స్థోమత లేకపోవడమేనని చెప్పారు.

Read Also : Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఈ ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్!