Marriage Breakup : ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటమే .. భార్యభర్తల విడాకులకు కారణమా?

ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నంత సేపు పట్టట్లేదు పెళ్లైన వెంటనే విడిపోవడానికి. కారణాలు ఏమైనా కావచ్చు.. కానీ ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువ అయ్యాయి. ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటం వల్లే జంటలు విడాకులకు సిద్ధమవుతున్నారా? అవునని చాలామంది అంటున్నారు.

Marriage Breakup : ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటమే .. భార్యభర్తల విడాకులకు కారణమా?

Marriage Breakup

Marriage Breakup : పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు పాత తరం వారు.. ఇప్పుడు పెళ్లంటే పెద్ద తంటా అనుకునే వారు.. అసలు పెళ్లే వద్దు బాబోయ్ అనుకునే వారు ఎక్కువయ్యారు. పెళ్లి అయినా మూణ్ణాళ్ల ముచ్చటగా విడిపోతున్నారు. ఇటీవల కాలంలో కోర్టుల్లో విడాకుల సంఖ్య పెరిగిపోతోందనే వార్తలు వింటున్నాం. అసలు పెళ్లి అయిన కొద్దిరోజులకే జంటల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? అవి బ్రేకప్‌కి ఎందుకు దారి తీస్తున్నాయి?

Wedding Photo Shoot : విడాకులు తీసుకుందట..పెళ్లి ఫోటోలకిచ్చిన డబ్బులు ఇచ్చేయాలని ఫోటో గ్రాఫర్‌కు వేధింపులు .. భోజనాలు తిన్నవారి సంగతేంటీ అంటూ సెటైర్లు

ఒకప్పుడు చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు వారి బాధ్యతలు ఇవే జీవితం. కానీ ఇప్పుడు చదువు, ఉద్యోగం, లక్షల్లో సంపాదన, మంచి ఇల్లు, కారు.. లగ్జరీ లైఫ్ ఇదే జీవితం. పెళ్లీడుకి వచ్చిన అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా అప్పటికీ ఇప్పటికి వారి ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ మంచి చదువులు చదువుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ అవుతున్నారు. అంతా బాగానే ఉంటోంది. కానీ పెళ్లిలో విఫలం అవుతున్నారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

 

ఒకప్పుడు వయసు రాగానే చదువు పూర్తైనా కాకున్నా తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేసేవారు. దాంతో అత్తింటివారి నుంచి, భర్త నుంచి ఎటువంటి కష్ట,నష్టాలు ఎదురైనా ఆడవారు భరించేవారు. ఎదిరించి బయటకు రావడానికి ఆలోచించేవారు. ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల కాస్త పిరికితనంగా కూడా ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఆడవారి జీవితంలో చాలా మార్పు వచ్చింది. తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా మారింది. పెళ్లి సంగతి దేవుడెరుగు.. తమ బిడ్డ బాగా చదువుకోవాలి.. ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి.. ఆ తరువాతే పెళ్లి అనే ఆలోచనకు వచ్చారు. దాంతో ఇప్పుడు ఆడపిల్లలు చదువు, ఉద్యోగంలో స్థిరపడటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి.

Bungee Jump : భార్యతో విడాకులు వచ్చిన ఆనందంలో ప్రాణాంతక సాహసం.. కట్ చేస్తే ఘోరం.. వీడియో వైరల్

ఇక అబ్బాయిల విషయానికి వస్తే కెరియర్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దాంలే అనుకునే రోజులు పోయాయి.. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా చాలామంది అబ్బాయిలకు పెళ్లి సంబంధం కుదరడమే కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు తమను చేసుకోవాలనుకునే అమ్మాయిలకు ఎలాంటి రూల్స్ పెట్టారో.. అవి ఇప్పుడు అబ్బాయిలు పాటించాల్సి వస్తోంది. అంటే టైమ్ రివర్స్ అయ్యిందన్నమాట. అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు వెతకడానికి మ్యారేజ్ బ్యూరోలు సైతం ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పెట్టే రూల్స్ చూసి చాలామంది బెదిరిపోతున్నారు.

 

అన్ని సెట్టై పెళ్లి కుదిరింది అనుకునే లోపు కొన్ని పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. పెళ్లికి ముందు ఉన్న రిలేషన్స్ కావచ్చు.. పెళ్లి కుదుర్చుకున్న సమయంలో చెప్పిన కొన్ని అబద్ధాలు కావచ్చు.. ఆర్ధిక విషయాల్లో ఎవరి స్వేచ్ఛ వారు కోరుకోవడం కావచ్చు చాలా త్వరగా విడిపోతున్నారు. ఒకరి మాట ఒకరు వినాలనే పంతం.. తల్లిదండ్రుల బాధ్యతల్ని పంచుకునే విషయం.. ఆఖరికి పిల్లల్ని కనాలా? వద్దా? అనే సున్నితమైన అంశాల్లో సైతం రచ్చరచ్చ చేసుకుంటున్నారు. కొందరు జంటలు విడిపోవడానికి వినే కారణాలు మరీ సిల్లీగా కూడా ఉంటున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత అందంగా చేసుకుంటున్నారో.. వారి బంధం అంత అందంగా ఉండట్లేదు.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

ఒకప్పుడు పేరెంట్స్ బాధపడతారని కావచ్చు..సొసైటీలో గౌరవం ఉండదనే ఆలోచన కావచ్చు విడాకులు అంటే కాస్త వెనుకడుగు వేసేవారు. కొంతకాలం ఎవరింట్లో వారు ఉన్నా మరల ఆలోచించుకుని మనసు మార్చుకుని తిరిగి కలిసి జీవించేవారు. ఇప్పుడు జీవితానికి సరిపడా డబ్బు సంపాదిస్తే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదనే ఆలోచనలో ఉంటున్నారు. మనిషికి తోడు కంటే మనిషికి ఆర్ధిక భద్రత చాలా అవసరం అని భావిస్తున్నారు. ఎప్పుడైతే ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నారో సంతోషంగా జీవించగలుగుతున్నారు. రాను రాను యువతలో వివాహ వ్యవస్థ మీద గౌరవం సన్నగిల్లుతోంది. ఇప్పుడున్న పరిస్థితులు.. చుట్టు చూస్తున్న కొన్ని అనుభవాలతో పెళ్లంటే యువత విముఖత చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ మరింత సన్నగిల్లే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

అన్ని అవయవాలు పనిచేస్తుంటే ఎవరి అవసరం ఉండదు. వయసు మీద పడే కొద్ది వేరే వ్యక్తి ఆసరా అవసరం అవుతుంది. ఆర్ధికంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా చివరికి పక్కన నిలబడే వ్యక్తి లేని రోజు మనిషిలో దిగులు మొదలవుతుంది. బంధాలు కలుపుకోవడం ఎంతో కష్టం. నిలుపుకోవడం కూడా అంతే కష్టం. విడాకుల పేరుతో విడిపోయే జంటలు ఒకసారి ఆలోచించుకోవాలి. పరిస్థితి తీవ్రతను బట్టి విడిపోవడం విషయంలో నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటులో విడిపోవాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జీవిత భాగస్వామిని కోల్పోతారు. అందుకే విడాకులకు అప్లై చేసేముందు కాసేపు ఆలోచించండి. వీలుంటే సమస్యను మీ ఇద్దరే పరిష్కరించుకోండి.