Guillain-Barre Syndrome : మహారాష్ట్రను వణికిస్తోన్న గిలియన్-బారే సిండ్రోమ్.. 130కి చేరిన కేసులు.. అరుదైన నరాల రుగ్మత లక్షణాలివే..!
Guillain-Barre Syndrome : మహారాష్ట్రలో జీబీఎస్ ధృవీకరణ కేసులు 130కి చేరాయి. పూణే నుంచి 25, కొత్త ప్రాంతాల నుంచి 74, పింప్రి చించ్వాడ్ నుండి 13, పూణే రూరల్ నుంచి 9, ఇతర జిల్లాల నుంచి 9 ఉన్నాయి.

Guillain-Barre Syndrome
Guillain-Barre Syndrome : మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) రోజురోజుకీ విజృంభిస్తోంది. రోజురోజుకీ రాష్ట్రంలో ఈ జీబీఎస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జీబీఎస్ కేసులు అక్కడి రాష్ట్ర ప్రజలను తీవ్రఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ జీబీఎస్ కొత్త కేసులు వంద దాటేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూణేతో పాటు మరికొన్ని జిల్లాల్లో అరుదైన నరాల రుగ్మత (జీబీఎస్) అనుమానిత కేసుల సంఖ్య 130కి పెరిగిందని వైద్యాధికారులు తెలిపారు.
వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కారణంగా ఈ జీబీఎస్ వ్యాధి వ్యాపిస్తోంది. పూణేకు చెందిన 56 ఏళ్ల మహిళ, షోలాపూర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ వ్యాధి బారినపడి మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అనుమానిత జీబీఎస్ కారణంగా వీరిద్దరూ మరణించారు. అంతకుముందు రోజు మూడు కొత్త అనుమానిత అంటువ్యాధులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
130కి చేరిన జీబీఎస్ కేసులు :
“మొత్తం 130 మంది అనుమానిత రోగులు, జీబీఎస్‌తో సంబంధం ఉన్న రెండు అనుమానిత మరణాలు ఇప్పటివరకు నమోదు అయ్యాయి. వీటిలో 73 ధృవీకరించిన జీబీఎస్ కేసులుగా నిర్ధారించారు. 25 మంది రోగులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల నుంచి 74 మంది పీఎమ్‌సీ పరిధిలో కొత్తగా చేర్చిన గ్రామాల నుంచి 13 మంది పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల నుంచి, తొమ్మిది మంది పూణే రూరల్ నుంచి, మరో తొమ్మిది మంది ఇతర జిల్లాల నుంచి ఉన్నారు”అని ఒక అధికారి తెలిపారు. కేసుల తీవ్రత పెరుగుతూ పోతుండటంతో నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అజిత్ పవార్ ఆరోగ్య అధికారులను ఆదేశించారు.
జీబీఎస్ వ్యాప్తికి కారణం ఇదే :
పూణెలో జరిగిన జిల్లా ప్రణాళికా సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, జీబీఎస్ రోగుల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసే ఆస్పత్రుల కఠిన చర్యలు తీసుకోవాలని పౌర, జిల్లా ఆరోగ్య అధికారులకు సూచించారు.
అవయవాలలో తీవ్రమైన బలహీనతతో సహా లక్షణాలతో అకస్మాత్తుగా తిమ్మిరి, కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన పరిస్థితికి తగినంత మందులు సరఫరా చేయాలని అధికారులను మంత్రి పవార్ ఆదేశించారు. పూణే, పరిసర ప్రాంతాలలో జీబీఎస్ వ్యాప్తి కలుషిత నీటి వనరులతో ముడిపడి ఉంటుంది. కలుషిత ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.
నగరంలో గుయిలియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాప్తి నివారణకు సంబంధించి రాష్ట్ర అధికారులకు సాయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూణేకు ఒక ఉన్నత-స్థాయి బృందాన్ని నియమించింది. మహారాష్ట్రకు పంపిన కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ఢిల్లీ, (NIMHANS) బెంగళూరు, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంతీయ కార్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వైరాలజీ (NIV), పూణే నుంచి ఏడుగురు నిపుణులు ఉన్నారు. పూణేలోని ఎన్‌ఐవీకి చెందిన ముగ్గురు నిపుణులు ఇప్పటికే స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నారు.
ఇలాంటివారికి రిస్క్ ఎక్కువ :
బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లు జీబీఎస్ బారినపడవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్‌పై పోరాడాల్సిన రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితిని గులియన్ బారే సిండ్రోమ్ అని పిలుస్తారు.
ఈ జీబీఎస్ సిండ్రోమ్ లక్షణాలివే :
ఈ జీబీఎస్ సోకినవారిలో శరీరమంతా తిమ్మిరిగా ఉంటుంది. కండరాలు బలహీనంగా మారడం, జ్వరం, వాంతులు, డయేరియా, పొత్తికడుపు నొప్పి లక్షణాలు ఉంటాయి. నీళ్లు, కలుషిత ఆహారం ద్వారా బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంటుంది. జీబీఎస్ అంటువ్యాధి కాదని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.