Protein : మీ శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరం…అధికంగా ప్రొటీన్ తీసుకుంటే?..

కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కిలోల శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే అదనపు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

Protein : మీ శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరం…అధికంగా ప్రొటీన్ తీసుకుంటే?..

Budapest Targyfoto, Still Life

Updated On : February 27, 2022 / 3:30 PM IST

Protein : ఫిబ్రవరి 27ని జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అవసరత, నియంత్రణ గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం, ఎందుకంటే ప్రోటీన్ తీసుకోవడం వ్యక్తుల సామర్థ్యంపై అధారపడి ఉంటుంది. ఈ సామర్ధ్యం వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అయితే అతిగా ప్రొటీన్ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. కండరాలు, అవయవాలు, ఎముకలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. కాబట్టి ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. ప్రోటీన్ అధికంగా తీసుకుంటే హృదయనాళ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీసే పరిస్ధితి ఉంటుంది.

అధిక-ప్రోటీన్ ఆహారాలు కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గడానికి, కండరాల బలోపేతానికి సహాయపడతాయి. అయితే, అధిక-ప్రోటీన్ ఆహారాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలను కలిగిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ముఖ్యం. పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన రోజువారీ మొత్తాన్ని మించి ప్రొటీన్ ను తీసుకోరాదు.

సర్టిఫైడ్ డయాబెటిస్ అధ్యాపకుడు, మసినా హాస్పిటల్‌లో క్లినికల్ డైటీషియన్ అనమ్ గోలాండాజ్ చెప్పిన ప్రకారం  ప్రోటీన్ అనేది రోజువారీ పెరుగుదల, నిర్వహణ కోసం మానవ శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకం, అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం మంచిదికాదని, హానికరం అని పరిశోధనల్లో తేలిందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు, తక్కువ నీరు తీసుకోవడంతో అధిక ప్రోటీన్ తీసుకోనే యువకులలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారకంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు.

మీ శరీరానికి ఎంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం?

డాక్టర్ ఎలీన్ కాండే, హెచ్ఓడి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చాలా మందికి తమ శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో తెలియక తికమకపడుతుంటారన్నారు. దీని వల్ల యాదృచ్ఛికంగా వారికి తెలియకుండానే ప్రోటీన్లను తినడానికి తావిస్తుంది. అవసరాలను అంచనా వేయడం. ఐసిఎంఆర్  2020 మార్గదర్శకాలు ప్రకారం ఆరోగ్యవంతమైన యుకుల వారి శరీర బరువులో కిలోకు 0.8 నుండి 1 గ్రామ్ ప్రొటీన్ అవసరమని ఆమె తెలిపారు. భారతదేశంలో కొంతమంది ఒక అంచనా ప్రకారం ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకుంటారని అన్నారు.

ఆరోగ్యకరమైన వ్యక్తులు ప్రోటీన్ అధిక మోతాదులో తీసుకోవాల్సిన పనిలేదని డాక్టర్ ఎలీన్ కాండే స్పష్టం చేస్తున్నారు. ప్రతి కిలో శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్లు అవసరమయ్యే వారి విషయానికి వస్తే అథ్లెట్లు, వెయిట్ ట్రైనర్లు, గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు ,డయాలసిస్‌లో ఉన్నవారు వంటి శారీరకంగా చాలా చురుకుగా ఉండే వ్యక్తులకు కిలో శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ అవసరమౌతుంది. అది కూడా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడు, డైటీషియన్ ద్వారా సూచించబడిన స్ధాయినే శరీరానికి అందించాలి. సొంతప్రయోగాలు ఏమాత్రం చేయరాదని ఆమె సూచించారు.

కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కిలోల శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే అదనపు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రొటీన్ జీవక్రియ యొక్క ఉప-ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి అవయవాలపై ప్రభావం చూపుతుంది. సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న మాంసాలను తినడం ద్వారా అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునే వ్యక్తులు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన మాంసాలను తీసుకోవడం ద్వారా అధిక ప్రోటీన్ ఆహారం కలిగి ఉన్న వ్యక్తులు నైట్రోసమైన్‌లు క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఏదైనా విపరీతమైన డైట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించే ముందు వైద్య నిపుణులు, లేదంటే అర్హత కలిగిన డైటీషియన్ ద్వారా ముందస్తుగా పూర్తి వివరాలను తెలుసుకోవటం మంచిదని డాక్టర్ ఎలిన్ కాండే సూచిస్తున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు తమ అవసరాల కంటే రెట్టింపు ప్రొటీన్ల ఆహారం తీసుకుంటారు. దీనివల్ల అధిక యూరిక్ యాసిడ్ ప్రమాదానికి గురవుతారని , ఆహారంలో తక్కువ ఫైబర్ తీసుకోవడం, నిర్జలీకరణం కారణంగా మలబద్ధకం గురికావచ్చని డాక్టర్ ఎలీన్ కాండే చెప్పారు. గుడ్డులోని తెల్లసొన, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు, పనీర్ లేదా కాటేజ్ చీజ్, సోయా లేదా టోఫు, చేపలు లేదా పౌల్ట్రీ వంటి సన్నని మాంసాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు, కాయలు మరియు విత్తనాలు వంటి ఇతర వనరులను తృణధాన్యాలతో కలిపి తీసుకోవటం ఉత్తమని ఆమె సూచిస్తున్నారు.

ముంబైలోని పరేల్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మంజుషా అగర్వాల్ చెప్పిన ప్రకారం ఒక వ్యక్తికి ప్రోటీన్ అవసరత ఎంత అన్నది శరీర బరువు, శారీరక శ్రమ, అనారోగ్యం, తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ వ్యక్తులకు రోజు వారిగా కెజీ బరువుకు 0.8గ్రాములు ప్రోటీన్ సిఫార్సు చేస్తారు. అయితే అథ్లెట్లు, మారథాన్ రన్నర్‌లు, బాడీ బిల్డర్‌లు వయస్సు బట్టి రోజుకు 1.5 నుండి 2 గ్రాములు ఒక కేజీ బరువు వరకు అధిక ప్రోటీన్ వినియోగం అవసరమౌతుందని డాక్టర్ మంజూషా చెబుతున్నారు.

అధిక ప్రోటీన్ ఆహారంలో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. గౌట్‌ను పెంచుతాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. డయాబెటిక్ రోగులలో అనవసరమైన అధిక ప్రోటీన్ ఆహారం డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ వ్యాధి ముప్పును మరింత పెంచుతుందని డాక్టర్ మంజూషా హెచ్చరిస్తున్నారు. అధికమైన ప్రోటీన్ సాధారణంగా కొవ్వు అధికంగా శరీరంలో నిల్వలు పెరుకునేలా చేస్తాయి. ఎక్కువ కేలరీలు తీసుకుంటే అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది. ఫైబర్ తక్కువగా ఉండే అధిక ప్రోటీన్ ఆహారంలో మలబద్ధక సమస్యను తెచ్చిపెడుతుందన్నారు. అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలనుకునేవారు ముందుగా పోషకాహార నిపుణుడితో మాట్లాడి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిదని డాక్టర్ మంజూషా సూచిస్తున్నారు.