Children’s Health : వేసవిలో పిల్లల అరోగ్యం విషయంలో!.

పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టేసి, తీసిన వెంటనే తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంత

Children’s Health : వేసవిలో పిల్లల అరోగ్యం విషయంలో!.

Children's Health In The Summer

Updated On : March 29, 2022 / 2:19 PM IST

Children’s Health : వేసవి కాలంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. ఎండవేడి కారణంగా చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వేడి వారిని అనారోగ్యం పాలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరగటం, నీరసం, వడబెబ్బకు గురికావటం వంటివి చోటు చేసుకుంటాయి.

అధిక ఉష్ణోగ్రత, కలుషితమైన నీరు, ఆహారం, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాలు… ఇలా కారణం ఏదైనా వేసవి సమయంలో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటలతో వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవడం… ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు గడిపితే అధిక చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

ఉదయం, సాయంత్రం ఎండలేని సమయాల్లోనే పిల్లలను బయటికి అనుమతించడం, తీసుకెళ్లడం చేయాలి. ఎండ సమయంలో పిల్లలకి కథలు చెప్తూ, రైమ్స్,పాటలు పాడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, బొమ్మలు వేయిస్తూ, ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకునేలా చూడాలి. కొబ్బరినీళ్లు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం వంటి ద్రవాలు తాగించాలి. సీజనల్ ఫ్రూట్స్, అన్నీ రకాల ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి. పిల్లలకి రెండు పూటలు తప్పక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నట్టయితే తడిబట్టతో తుడుస్తూ మామూలు స్థితికి తీసుకురావాలి.

ఇంట్లోకి వేడిగాలి నేరుగా చొచ్చుకు రాకుండా చుట్టూ మ్యాట్ లు వేలాడదీయాలి. ఇవి పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవడం వల్ల గదులన్నీ చల్లని వాతావరాణాన్నికలిగి ఉంటాయి. పలుచటి, మెత్తటి కాటన్‌ దుస్తులు వేయాలి. బయటికి వెళ్లాల్సివస్తే గొడుగు, టోపీ,తప్పకుండా ధరించాలి. పిల్లలు ఆటల్లోపడి నీరు తాగడం మర్చిపోవచ్చు. దాహంతో సంబంధం లేకుండా మంచి నీరు వారికి అందించాలి. సాధ్యమైనంత వరకు నిలువ ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారం మాత్రమే పెట్టాలి. వేసవి కాలంలో బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత నిమ్మకాయ రసం, ఖర్జూరం పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది.

వండిన పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టేసి, తీసిన వెంటనే తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు. ఫ్రిజ్ ల్లో కూలింగ్ నీరు తాగడం వల్ల పిల్లలు వెంటనే జబ్బుపడేఅవకాశాలు ఉంటాయి. ఎండాకాలం వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. కళ్ళకలక, గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, అతిసారా, కామెర్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇలాంటి వ్యాధుల విషయంలో అప్రమత్తగా ఉండటంతోపాటు జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం డీహైడ్రేషన్ కి లోనయినట్టు అనిపించినా ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి. రాగి, సజ్జలు, తదితర తృణధాన్యాల జావను మజ్జిగలో లేదంటే పాలలో కలిపి ఇస్తే పిల్లలు డీ హైడ్రేషన్‌కు గురికారు.