Health Care : వయస్సు 40 దాటిందంటే?…

చాలా మంది పురుషుల్లో 40ఏళ్లు దాటాక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాధుల వల్ల శరీరంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

Health Care : వయస్సు 40 దాటిందంటే?…

40 Years After

Health Care : వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. ముఖ్యంగా మగవారిలో 40 ఏళ్ల వయస్సు దాటితే ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత మారిన జీవన పరిస్ధితుల్లో అనారోగ్యసమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

40 ఏళ్ల వయస్సు వచ్చిందంటే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ వయస్సులో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. మారిన ఆహారపు అలవాట్ల నేపధ్యంలో ఈమధ్యకాలంలో యువతలో గుండెజబ్బులు తలెత్తుతున్నాయి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్ధాయిని ఏప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి.

చాలా మంది పురుషుల్లో 40ఏళ్లు దాటాక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాధుల వల్ల శరీరంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. కొంత మందికి అసలు తమకు ఈ వ్యాధులు ఉన్న విషయమే తెలియక కనీసం వైద్యపరీక్షలు చేయించుకోవాలన్న అవగాహనే ఉండదు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అనుకోని పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తపోటు కారణంగా పక్షవాతం వంటి జబ్బులకు గురవుతారు.

కుటుంబపరమైన సమస్యలు, ఆందోళనలు, పని ఒత్తిడి, ఇంటి గొడవల వల్ల మానసిక సమస్యలు చుట్టుముట్టేస్తాయి. రాత్రిపూట సరైన నిద్రలేక ఒత్తిడికి లోనవుతారు. ధూమపానం, మద్యం సేవించకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. కనీసం 6మాసాలకు ఒకసారైనా పరీక్షలు చేయించుకోవటం విధిగా పాటించాలి. ఇలా చేయటం వల్ల ముందుగానే భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలపై ఒక అంచనాకు వచ్చి అందుకు తగ్గట్టుగా వైద్య సహాయం పొందేందుకు అవకాశం ఉంటుంది.

శరీరంలోని కండరాల క్షీణత , ఎముకల్లో బలహీనత వంటి సమస్యలు 40 వయస్సు దాటాక ఉత్పన్నమౌతాయి. అలాంటి సమయంలో శరీరంలో కాల్షియం ఏమోతాదులో ఉందో పరీక్ష చేయించుకోవాలి. వైద్యుని సలహామేరకు ఎముకలు, కండరాల పటుత్వానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవటం , వ్యాయామాలు చేయటం వంటివి చేయాలి. 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో శరీర రక్షణ వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఆసమయంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాలి.