బైక్ రైడర్ మృతి : కోచిలో రోడ్లపై గుంతలు.. మృత్యువు ఘంటికలు

ఒకవైపు భారీ వర్షాలు.. వరదల తాకిడికి రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు.. అడుగు పెడితే కిందపడటమే. వాహనాలు నడిపే రైడర్ల నడములు విరిగిపోతున్నాయి. బైకులు, కార్లు పాడైపోతున్నాయి. గుంతల తాకిడికి తట్టుకోలేక వాహనాలు ట్రబుల్ ఇస్తున్నాయి. గతుకుల రోడ్డుపై వాహనాలు నడపాలంటేనే వాహనాదారులు బెంబేలిత్తిపోతున్నారు. కోచిలోని రోడ్డుపై గుంతలు మృత్యువు ఘంటికలను మోగిస్తున్నాయి.
రోడ్లపై వరద నీటి గుంతలు.. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో పడి బైక్ అదుపు తప్పి కిందపడుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. బైకర్ల ప్రాణాలను బలిగొంటున్న గుంతలను మరమ్మత్తులు చేసేవారే కరువై పోయారు. అధికారిక యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మరింది.
రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు గాయపడుతున్నారు. ఎర్నాకులం జిల్లాలోని కోచి సమీపంలో సహోదరన్ అయ్యప్పన్ రోడ్ దగ్గర భారీ గుంత ఉంది. ఈ గుంతను పూడ్చేవారే లేరు. స్కూటిపై వెళ్తున్న శ్రీప్రియ కళాదరన్ అనే మహిళ గుంతలో పడింది. ఆమెకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమె గాయపడిన కొన్ని గంటల్లోనే ఉమేశ్ అనే వ్యక్తి అదే గుంతలో పడ్డాడు. బైక్ జారి రోడ్డుపై పడ్డాడు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి మృతిచెందాడు.
ఈ ఘటన స్థానిక మీడియాలో వైరల్ అయింది. తాను పడిన గుంతలో పడి ఒక వ్యక్తి మరణించాడని తెలిసిన బాధిత మహిళ ఫేస్ బుక్ లో ఘటనపై పోస్టు పెట్టింది. ఎర్నాకులం జిల్లా కలెక్టర్ కు ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్. సుషాస్ రెండోసారి కార్పొరేషన్ అధికారికులకు వార్నింగ్ ఇచ్చారు. రోడ్లపై మరమ్మత్తులు చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.