AI Death Calculator : మీరు ఎప్పుడు చనిపోతారో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్ ముందే చెప్పేస్తుంది!

AI Death Calculator : ఏఐ డెత్ కాలిక్యులేటర్.. ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు లేదా ఈసీజీని ఉపయోగించి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు, మరణాన్ని అంచనా వేసే టెక్నాలజీని నిపుణులు అభివృద్ధి చేశారు.

AI Death Calculator : మీరు ఎప్పుడు చనిపోతారో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్ ముందే చెప్పేస్తుంది!

This AI calculator can tell how close you are to death ( Image Source : Google )

Updated On : November 9, 2024 / 10:41 PM IST

AI Death Calculator : మరణం అనేది ఎవరూ ముందుగానే ఊహించలేరు. అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరికి సాధ్యపడదు. ప్రతిజీవికి పుట్టిన గడియ తెలిసే ఉంటుంది. కానీ, మరణించే తేదీ మాత్రం తెలియదు. అలా తెలిస్తే వారి మనుగడ ఊహించుకోవడం కూడా కష్టమే.. ప్రస్తుత ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రపంచంలో మనిషి ఎప్పుడు మరణించబోతున్నాడో కూడా తెలిసుకోవచ్చునని అంటున్నారు పరిశోధకులు. మరణాన్ని ముందుగానే అంచనా వేసే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేశామని చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

పరిశోధకులు ఏఐ ఆధారిత టెక్నాలజీతో ‘డెత్ కాలిక్యులేటర్‌’ను అభివృద్ధి చేశారు. మీరు మీ మరణానికి ఎంత సమీపంలో ఉన్నారో ఈ కాలిక్యులేటర్ తెలియజేస్తుంది. లాన్సెట్ డిజిటల్ హెల్త్‌లో ప్రచురించిన ఏఐ పవర్డ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు (ECG) ఒక వ్యక్తి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు మరణాల ప్రమాదాన్ని కూడా అంచనా వేయొచ్చునని అధ్యయనం వెల్లడించింది. అయితే, ఈ ఏఐ టూల్ రోజువారీ వైద్య సంరక్షణలో ఉపయోగం ఉండదని చెప్పవచ్చు.

ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు లాన్సెట్ పరిశోధకులు ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేటర్ (AIRE) అనే కొత్త టూల్ రూపొందించారు. ఈ ఏఐఆర్ఈ టెక్నాలజీ ముందుగానే మరణాలను అంచనా వేయగలదు. భవిష్యత్తులో గుండె వైఫల్యాన్ని కూడా అంచనా వేయగలదు. ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేటర్ (AIRE) ప్లాట్‌ఫారమ్‌ ద్వారా గత ఏఐ-ఈసీజీ విధానాలతో ఈ పరిమితులను పరిష్కరించేందుకు ప్రయత్నించామని పరిశోధకులు పేర్కొన్నారు.

యూకే ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ కింద ఉన్న రెండు ఆస్పత్రులు వచ్చే ఏడాది మధ్య నుంచి ఈ ఏఐ టెక్నాలజీని ట్రయల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, వచ్చే ఐదేళ్లలోపు ఆరోగ్య సేవల్లోకి అందుబాటులోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆసుపత్రుల్లోకి చేరే వందలాది మంది రోగులు త్వరలో ఏఐ “డెత్ కాలిక్యులేటర్” ద్వారా తమ జీవితకాలం గురించి అంచనా వేయొచ్చు.

ఈ ఏఐ టూల్ ఒకే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) పరీక్షను ఉపయోగిస్తుంది. గుండె కార్యకలాపాలను నిమిషాల్లో రికార్డ్ చేస్తుంది. ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు (AI-ECG) రిస్క్ ఎస్టిమేషన్ లేదా (AIRE) ప్రోగ్రామ్ వినియోగిస్తారు. ఈసీజీ తర్వాత 10ఏళ్లలో 78శాతం వరకు కచ్చితత్వంతో మరణముప్పును సరిగ్గా గుర్తించినట్టు అధ్యయనాల్లో రుజువైంది.

ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది? :
లాన్సెట్ పరిశోధకులు 1,89,539 మంది రోగుల నుంచి 1.16 మిలియన్ ఈసీజీ పరీక్ష ఫలితాల డేటాసెట్‌ను ఉపయోగించి ఏఐ టెక్నాలజీకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఏఐ కాలిక్యులేటర్ మూడు వంతుల (76శాతం) కేసులలో భవిష్యత్తులో తీవ్రమైన గుండె లయ సమస్యలను గుర్తించింది. పది కేసులలో ఏడింటిలో భవిష్యత్తులో అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ వ్యాధి, ధమనులు సన్నబడి రక్త ప్రవాహాన్ని కష్టతరం చేస్తాయని హెచ్చరించింది. అదేవిధంగా, వైద్యులకు రోగనిర్ధారణ మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రమాదాల గురించి కూడా తెలియజేస్తుంది. రాబోయే వ్యాధుల ప్రమాదాన్ని కూడా ముందుగానే అలర్ట్ చేస్తుంది. ఉదాహరణకు.. ఏఐఆర్ఈ (AIRE) ప్రమాద అంచనా ప్రకారం.. మీరు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని చెబితే.. ఆ ముప్పును నిరోధించడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, ఫీచర్లు లీక్!