Worms : నులిపురుగులతో చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు!…

మట్టిలో ఆటలాడిన తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే కడుపులోకి చేరి పేగుల్లో జీవనం ఏర్పాటుచేసుకుంటాయి.

Worms : నులిపురుగులతో చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు!…

Worms Threaten

Updated On : March 4, 2022 / 3:57 PM IST

Worms : పిల్లల ఆరోగ్యంపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నారుల ఎదుగుదలకు ఇవి అవరోధంగా మారతాయి. 19 ఏళ్లలోపు చిన్నారుల్లో చాలా మంది ఈ నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటారు. ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం, రక్తహీనత, బలహీనంగా మారటం, విరేచనాలు వంటి సమస్యలు ఈ నులి పరుగుల కారణంగా పిల్లల్లో కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు అసలు సమస్య తెలియక ఆందోళన చెందుతుంటారు.

చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత ఆహారం వల్ల ఇవి సంక్రమిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి హాని కలిగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు అపరిశుభ్రత వల్లే ఈ నులిపరుగుల సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. మట్టిలో ఆటలాడే చిన్నారుల్లో ఈ నులిపరుగుల సమస్య అధికంగా ఉంటుంది. పేగులను ఆవాసంగా మార్చుకొని వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. మల విసర్జన ద్వారా బయటకొచ్చి మన చుట్టూ పరిసరాల్లో వ్యాపిస్తాయి.

మట్టిలో ఆటలాడిన తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే కడుపులోకి చేరి పేగుల్లో జీవనం ఏర్పాటుచేసుకుంటాయి. తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నులిపురుగుల సమస్యతో బాధపడే చిన్నారుల్లో ఏకాగ్రత లోపించటం, కడుపునొప్పి, పిల్లల్లో ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయని అల్బెండజోల్ మాత్రలను వాడటం ద్వారా నులిపురుగులను నిర్మూలించటం సాధ్యమౌతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల చేతి వేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించటంతోపాటు , భోజనం చేసే సమయంలో శుభ్రంగా చేతులను కడుక్కునేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సి ఉంది.